యేఽప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః ।
తేఽపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ॥ 23
యే, అపి, అన్య దేవతా, భక్తాః, యజంతే, శ్రద్ధయా, అన్వితాః,
తే, అపి, మామ్, ఏవ, కౌంతేయ, యజంతి, అవిధిపూర్వకమ్.
కౌంతేయ = అర్జునా; శ్రద్ధయా అన్వితాః = శ్రద్ధతో (ఆస్తిక్య బుద్ధితో); యే భక్తాః అపి = ఏ భక్తులు కూడా; అన్య దేవతాః = ఇతర దేవతలను; యజంతే = పూజిస్తున్నారో; తే అపి = వారు కూడా; అవిధి పూర్వకమ్ = తమకు తెలియకుండా; మామ్ ఏవ = నన్నే; యజంతి = పూజిస్తున్నారు.
తా ॥ (నీ కంటే వేరైన దేవత లేదు, కనుక ఇంద్రాది దేవతలను సేవించేవారు కూడా నీ భక్తులే –మరి వారు ఎలా తిరిగివస్తున్నారు? అంటావా:) కౌంతేయా! ఆస్తిక్యబుద్ధియుక్తులై అన్యదేవతలను పూజించేవారు కూడా నన్నే పూజిస్తున్నారు. కాని, వారు ఎరుకలేకుండానే,* (మోక్షప్రాపకమైన విధిరహితంగా) భజిస్తున్నారు. (కనుక, మళ్ళీ ఇహానికి వస్తున్నారు.)