మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః ।
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ॥ 12
మోఘ ఆశాః, మోఘకర్మాణః, మోఘజ్ఞానాః, విచేతసః,
రాక్షసీమ్, ఆసురీమ్, చ, ఏవ, ప్రకృతిమ్, మోహినీమ్, శ్రితాః.
మోఘ ఆశాః = వ్యర్థకాములూ; మోఘ కర్మాణః = విఫలకర్ములూ; మోఘ జ్ఞానాః = నిష్ఫలజ్ఞానులూ; విచేతసః = వివేకశూన్యులూ అయినవారు; మోహినీమ్ = మోహకరమూ, దేహాత్మబుద్ధిని కలిగించేదీ; రాక్షసీమ్ = రాక్షసమూ (తామసమూ); ఆసురీం చ = ఆసురమూ (రాజసమూ) అయిన; ప్రకృతిమ్ = స్వభావాన్ని; శ్రితాః ఏవ (సంతః మామ్ అవజానంతి) = ఆశ్రయించినవారు (అగుచు నన్ను తెలియకున్నారు.)
తా ॥ (అన్యదేవతలు శీఘ్రంగా ఫలాలను ఒసగుతారని తలిచే) వ్యర్థ కాములూ, (నా నుండి విముఖులైన) విఫల కర్ములూ, (నానా విధాలైన కుతర్కాలను ఆశ్రయించే) నిష్ఫల జ్ఞానులూ, (విక్షిప్త చిత్తులైన) వివేకశూన్యులూ, (హింసాది ప్రచురమైన) తామసాన్ని, (కామ దర్పాది బహుళమైన) రాజసాన్ని, బుద్ధి భ్రంశకరమూ అయిన స్వభావాన్ని ఆశ్రయించి, నన్ను తెలియకున్నారు. (గీత : 16–7, 21 చూ:)