న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ।
ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు ॥ 9
న, చ, మామ్, తాని, కర్మాణి, నిబధ్నంతి, ధనంజయ,
ఉదాసీనవత్, ఆసీనమ్, అసక్తమ్, తేషు, కర్మసు.
ధనంజయ = అర్జునా; తేషు = ఆ; కర్మసు = కర్మలయందు; అసక్తమ్ = అనాసక్తుడనైన; ఉదాసీనవత్ చ = తటస్థునిగా; ఆసీనమ్ = వెలయు; మామ్ = నన్ను; తాని = ఆ; కర్మాణి = కర్మలు; న నిబధ్నంతి = బంధించవు.
తా ॥ (ఈ విధంగా నానావిధ కర్మలను ఆచరించే నీకు, జీవుని వలే, బంధం ఎందుకు కలగడం లేదు? అని అంటావా-) (ఆప్తకాముణ్ణి అవడం చేత) ఆ కర్మలలో నాకు ఆసక్తి లేదు. తటస్థుడనై ప్రకాశించే నన్ను అవి బంధింపజాలవు. (నా వలెనే ఇతరులు కూడా కర్తృత్వాభిమాన – ఫలాసక్తి శూన్యులైతే, కర్మల వల్ల బంధించబడరు.)