సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ ।
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ॥ 7
సర్వభూతాని, కౌంతేయ, ప్రకృతిమ్, యాంతి, మామికామ్,
కల్పక్షయే, పునః, తాని, కల్ప ఆదౌ, విసృజామి, అహమ్.
కౌంతేయ = కుంతీపుత్రా; సర్వభూతాని = సమస్తభూతాలూ; కల్పక్షయే = ప్రళయకాలంలో; మామికామ్ = మదీయము (నా); ప్రకృతిమ్ = త్రిగుణాత్మికమైన మాయలో; యాంతి = కలిసిపోతున్నాయి; పునః = మళ్ళీ; కల్ప ఆదౌ = సృష్టికాలంలో; తాని = ఆ భూతాలనన్నింటిని; అహమ్ = నేను విసృజామి = సృష్టిస్తున్నాను.
తా ॥ [ఈ విధంగా అసంగుడైన భగవంతుడు యోగమాయ చేత స్థితిహేతువైన రీతి (5 వ శ్లోకంలో) చెప్పబడింది; ఇక సృష్టి ప్రళయ హేతుత్వం చెప్పబడుతోంది:] కౌంతేయా! ప్రళయకాలంలో సర్వభూతాలూ త్రిగుణాత్మకమైన నా మాయ యందు లీనమవుతున్నాయి; మళ్ళీ, కల్పారంభంలో నేను వాటిని సృష్టిస్తున్నాను. (కుమార సంభవమ్, 2–4 చూ:)