వేదేషు యజ్ఞేషు తపస్సుచైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ ।
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ॥ 28
వేదేషు, యజ్ఞేషు, తపస్సు, చ, ఏవ, దానేషు, యత్, పుణ్యఫలమ్, ప్రదిష్టమ్,
అత్యేతి, తత్, సర్వమ్, ఇదమ్, విదిత్వా, యోగీ, పరమ్, స్థానమ్, ఉపైతి చ, ఆద్యమ్.
వేదేషు = వేదాలలో; యజ్ఞేషు = యజ్ఞాలలో; తపస్సు చైవ = తపస్సులలో; దానేషు = దానాలలో; యత్ = ఏ; పుణ్యఫలమ్ = పుణ్య ఫలంగా; ప్రదిష్టమ్ = శాస్త్రాలలో చెప్పబడిందో; ఇదమ్ = ఈ బ్రహ్మకర్మాది సప్తపదార్థ తత్త్వాన్ని, ఈ ఎనిమిది ప్రశ్నలకు ప్రత్యుత్తరంగా చెప్పబడిన దీనిని; విదిత్వా = గ్రహించిన (అనుష్ఠించిన); యోగీ = సమాహిత చిత్తుడు; (జ్ఞానియై) తత్ = ఆ; సర్వమ్ = సర్వాన్ని; అత్యేతి = అతిక్రమిస్తూ, దానికంటే ఉన్నతమైన యోగైశ్వర్యాన్ని పొందుతాడు; చ = మరియు; ఆద్యమ్ = జగన్మూలభూతమైన; పరమ్ = శ్రేష్ఠమైన; స్థానమ్ = విష్ణుపదాన్ని (బ్రహ్మపదాన్ని); ఉపైతి = పొందుతాడు.
తా ॥ వేదాధ్యయనం, యజ్ఞానుష్ఠానం, తపస్సు, దానం – వీటికి ఏ పుణ్యఫలం శాస్త్రాలలో నిర్దిష్ఠమై ఉందో ఈ అధ్యాయంలో తెలుపబడిన దానిని గ్రహించి అనుష్ఠించే యోగి(జ్ఞానియై), దానిని అతిక్రమిస్తూ – అంతకంటే శ్రేష్ఠమైన యోగైశ్వర్యాన్ని పొందుతున్నాడు. మరియు, జగన్మూలభూతమూ, శ్రేష్ఠమూ అయిన బ్రహ్మపదాన్ని పొందుతున్నాడు.
వ్యాఖ్య:-
ఈ అధ్యాయంలో వివరించిన నాశనం లేని ఆ ‘పరబ్రహ్మ తత్త్వాన్ని’ తెలుసుకున్న వ్యక్తికి ఎంత గొప్ప పుణ్యం దక్కుతుందో, అతను ఎంతటి అత్యున్నత స్థానాన్ని పొందుతాడో ఇక్కడ చెప్పారు. 1.వేదాలు చదవడం వల్ల, 2.యజ్ఞాలు చేయడం వల్ల, 3.తపస్సు చేయడం వల్ల, 4.దానధర్మాలు చేయడం వల్ల…మనిషికి ఎంత పుణ్యం వస్తుందో, అంతకంటే ఎక్కువ పుణ్యాన్ని ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకున్న యోగి పొందుతాడని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. దీనిని బట్టి అన్నింటికంటే గొప్ప పుణ్యం ఏది? దేనిని ఆశ్రయిస్తే మనిషి పుణ్యఫలాలన్నింటిలోనూ అత్యున్నత స్థితిని (శిఖరాన్ని) చేరుకోగలడు? అనే విషయం ఇక్కడ రుజువైంది.ఈ ప్రపంచంలో ఆ పరబ్రహ్మమొక్కటే సత్యం. మిగతావన్నీ మాయ (మిథ్య). కాబట్టి, ఆ సత్యమైన పరమాత్మను ఆశ్రయించిన వారికే పరిపూర్ణమైన పుణ్యఫలం లభిస్తుంది.
వేదాలు చదవడం, యజ్ఞాలు చేయడం, తపస్సు, దానధర్మాలు చేయడం వల్ల జీవుడికి ఎంతో కొంత పుణ్యం లభిస్తుంది. కానీ పరమాత్మను ధ్యానించే యోగి లేదా ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఆ పుణ్యాలన్నింటినీ దాటి, అంతకంటే ఉన్నత స్థితికి వెళ్తాడు. ఆత్మను తెలుసుకోవడం ద్వారా అతడు అంతులేని పుణ్యాన్ని పొందుతాడు. సముద్రంలో నీటిబొట్టు ఎలాగైతే ఒక భాగమో, వందలో యాభై ఎలాగైతే ఇమిడి ఉంటుందో… అలాగే బ్రహ్మజ్ఞానం వల్ల కలిగే ఆ మహా పుణ్యంలోనే మిగతా చిన్న చిన్న పుణ్యాలన్నీ ఇమిడి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే… ఆ చిన్న చిన్న పుణ్యాలన్నీ వాటి ఫలితాన్ని అనుభవించాక కాలక్రమేణా నశించిపోతాయి (ఖర్చయిపోతాయి). కానీ బ్రహ్మానుభూతి వల్ల వచ్చే పుణ్యం అనంతమైనది, అది ఎప్పటికీ తరగదు. మిగతా పుణ్యాలు మంచివే (శ్రేష్ఠమే) అయినప్పటికీ, ఇది వాటన్నింటికంటే అత్యున్నతమైనది. కాబట్టి తెలివైనవారు కేవలం ఈ శాశ్వతమైన జ్ఞానం కోసమే ప్రయత్నించాలి.
లోకంలో కొందరికి చదువు రాకపోవడం వల్ల వేదాలు చదవలేకపోవచ్చు. చేతిలో డబ్బు లేకపోవడం వల్ల యజ్ఞాలు చేయలేకపోవచ్చు. శరీరంలో బలం లేక కఠినమైన తపస్సులు చేయలేకపోవచ్చు. పేదరికం వల్ల దానధర్మాలు కూడా చేయలేకపోవచ్చు. మరి అలాంటి వారికి పుణ్యం దక్కే దారి లేదా? వాళ్ళు ఇక దిగులుపడాల్సిందేనా? అవసరం లేదు! పైన చెప్పిన వాటన్నింటికంటే గొప్ప పుణ్యాన్ని సంపాదించుకునే ఉపాయాన్ని భగవంతుడు ఇక్కడ చాలా దయతో చెప్పాడు. అదే పరమాత్మ ధ్యానం (బ్రహ్మ జ్ఞానం). దీనికి పెద్ద పెద్ద చదువులు, తపస్సులు, యజ్ఞాలు, దానాలతో పనేలేదు. దీనికి కావలసిందల్లా మనసు నిర్మలంగా ఉండటం, హృదయం పవిత్రంగా ఉండటం, స్వచ్ఛమైన భక్తి కలిగి ఉండటమే. ఈ అర్హతలు ఉన్నవారు ఆత్మజ్ఞానాన్ని పొంది, మిగతా పుణ్యఫలాలన్నింటినీ దాటి ఉన్నత స్థితికి వెళ్తారు.
అయితే, దీని అర్థం దానధర్మాలు, వేద పఠనం వంటి మంచి పనులను పూర్తిగా మానేయమని కాదు. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా (నిష్కామంగా) వాటిని ఆచరిస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే క్రమంగా మనసు శుద్ధి అవుతుంది. ఆ పవిత్రమైన మనసుతో ఆత్మానుభూతిని పొందడమే అసలైన గొప్ప పుణ్యం అని దీని భావం.
అంతేకాదు, ఆ బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకున్న యోగి, అందరికంటే మొదటిదైన, అత్యున్నతమైన సాక్షాత్ ఆ బ్రహ్మాన్నే పొందుతాడని ఇక్కడ చెప్పారు. ‘బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు’ అని వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. భగవంతుడు దీనిని ‘పరంధామం’ (అత్యున్నత స్థానం) అని పిలిచాడు. దీన్నిబట్టి ఈ ప్రపంచంలో ఉండే అన్ని పదవులకంటే, హోదాలకంటే బ్రహ్మపదవి చాలా గొప్పదని అర్థమవుతోంది. మిగతా పదవులు, స్థానాలు, సంపదలు అన్నీ నాశనమయ్యేవే. అవి కాలానికి, ప్రదేశానికి లోబడి ఉంటాయి. శరీరం వదిలేయగానే (చనిపోగానే) వాటితో సంబంధం తెగిపోతుంది. కానీ బ్రహ్మపదవి, ఆత్మస్థానం అలాంటివి కావు. అవి శాశ్వతమైనవి. అందుకే కృష్ణుడు దీనిని ‘పరమ స్థానం’ అని వర్ణించాడు. కాబట్టి మోక్షం కోరుకునేవారు (ముముక్షువులు) చిన్న చిన్న పుణ్యాలతో సరిపెట్టుకోకూడదు. పుణ్యానికి నిధి వంటి, అత్యంత గొప్పదైన ఆ బ్రహ్మపదాన్ని (ఆత్మ స్థానాన్ని) గీతలో చెప్పిన సాధనల ద్వారా పొంది, మానవ జన్మను సార్థకం చేసుకోవాలి.
‘యోగీ’ – యోగమనగా జీవుని భగవంతునితో చేర్చుమార్గము.. అది నిష్కామకర్మయైనను, భక్తియైనను, ధ్యానమైనను, జ్ఞానమైనను సరియే దేనిననుసరించినను అతడు యోగియే యగును.
ఈ శ్లోకం ద్వారా వేదాలు చదవడం, యజ్ఞాలు చేయడం, తపస్సులు, దానధర్మాలు… వీటన్నింటికంటే ‘బ్రహ్మజ్ఞానం’ (ఆత్మానుభవం) ఎంతో శ్రేష్ఠమైనదని, అన్నింటికంటే ఉత్తమమైనదని స్పష్టమవుతోంది. కాబట్టి, ఆధ్యాత్మిక సాధనలో మొదటి దశలో తపస్సు, దానధర్మాలు వంటివి ఆచరించినప్పటికీ, అక్కడితోనే తృప్తిపడి ఆగిపోకూడదు. వాటి ద్వారా క్రమంగా మనసును శుద్ధి చేసుకుంటూ, ఇంకా ఉన్నత స్థితికి ఎదిగి, చివరకు ఆత్మజ్ఞానాన్ని (బ్రహ్మానుభూతిని) పొందాలి.