సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ ।
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ ॥ 12
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ ।
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ ॥ 13
సర్వద్వారాణి, సంయమ్య, మనః, హృది, నిరుధ్య, చ,
మూర్ధ్ని, ఆధాయ, ఆత్మనః, ప్రాణమ్, ఆస్థితః, యోగధారణామ్.
ఓమ్, ఇతి, ఏక అక్షరమ్, బ్రహ్మ, వ్యాహరన్, మామ్, అనుస్మరన్,
యః, ప్రయాతి, త్యజన్, దేహమ్, సః, యాతి, పరమామ్, గతిమ్.
సర్వ ద్వారాణి = ఇంద్రియాలన్నింటిని; సంయమ్య = నియమించి; మనః = మనస్సును; హృది = హృదయ (పుండరీకం)లో; నిరుధ్య చ = నిలిపి ప్రాణమ్ = ప్రాణాన్ని; మూర్ధ్ని = భ్రూయుగ మధ్యంలో; ఆధాయ = ఉంచి; ఆత్మనః యోగ ధారణామ్ = ఆత్మయోగంలో; అస్థితః = వెలయుచు; ఓమ్ ఇతి = ఓమ్ అనే; ఏక అక్షరం బ్రహ్మ = ఏకాక్షర బ్రహ్మాన్ని; వ్యాహరన్ = ఉచ్చరిస్తూ; మామ్ = నన్ను; అనుస్మరన్ = స్మరిస్తూ; దేహమ్ = శరీరాన్ని; త్యజన్ = వీడి; యః = ఎవడు; ప్రయాతి = ప్రయాణిస్తున్నాడో; సః = అతడు; పరమామ్ = ఉత్తమమైన; గతిమ్ = గతిని, మోక్షాన్ని; యాతి = పొందుతున్నాడు.
తా ॥ ఇంద్రియాలన్నింటినీ నియమించి (అంటే, బాహ్యవిషయ గ్రహణం లేకుండా) మనస్సును హృదయంలో నిలిపి, (అంటే, బాహ్యవిషయ స్మరణను కూడా చేయకుండా) భ్రూమధ్యంలో ప్రాణాన్ని స్థాపించి* , ఆత్మయోగంలో వెలయుచు బ్రహ్మప్రతీకమూ (బ్రహ్మవాచకం), ఏకాక్షరమూ అయిన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ, నన్ను స్మరిస్తూ, శరీరాన్ని వదిలి (అర్చిరాది మార్గంలో) ప్రయాణం చేసినవాడు శ్రేష్ఠమైన గతిని పొందుతున్నాడు. (కఠోపనిషత్తు. 2–6–16)