అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ ।
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ॥ 4
అధిభూతమ్, క్షరః, భావః, పురుషః, చ, అధిదైవతమ్,
అధియజ్ఞః, అహమ్, ఏవ, అత్ర, దేహే, దేహభృతామ్, వర.
దేహభృతాం వర = శరీరధారు లందరిలోనూ శ్రేష్ఠుడవైన ఓ అర్జునా; క్షరః = నశించేదైన; (దేహాదులైన) భావః = పదార్థతతి; అధిభూతమ్ = అధిభూతం, ప్రతిజీవుణ్ణి అనుసరించి ఉండేదని చెప్పబడుతుంది; పురుషః = హిరణ్యగర్భుడు; అధిదైవతమ్ = అధిష్ఠాతయైన దేవత; చ = మరియు; అత్ర దేహే = ఈ శరీరంలో; అహం ఏవ = నేనే; అధి యజ్ఞః = విష్ణువనబడే యజ్ఞాధిష్ఠాన దేవతను, యజ్ఞప్రవర్తకుడనే, యజ్ఞఫలప్రదాతను.
తా ॥ నరశ్రేష్ఠుడవైన అర్జునా! శరీరాది వినాశశీల పదార్థాలే అధిభూతం అని చెప్పబడుతున్నాయి. పురుషుడు అంటే, నిజాంశ సంభూతులైన సర్వదేవతలకూ అధిపతీ, సూర్యమండల మధ్యవర్తీ అయిన వైరాజపురుషుడు (హిరణ్యగర్భుడు) అధిదైవతం –సమస్త దేవతల అధిష్ఠాత. ఈ శరీరంలో అంతర్యామి రూపంలో ప్రకాశిస్తున్న నేనే అధియజ్ఞాన్ని –విష్ణువనబడే* యజ్ఞాధిష్ఠాన దేవతను, యజ్ఞ ప్రవర్తకుణ్ణి, యజ్ఞఫలదాతను. (గీత: 9–24 చూ.)