శ్రీభగవానువాచ :
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే ।
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ॥ 3
అక్షరమ్, బ్రహ్మ, పరమమ్, స్వభావః, అధ్యాత్మమ్, ఉచ్యతే,
భూత భావ ఉద్భవకరః, విసర్గః, కర్మసంజ్ఞితః.
శ్రీభగవాన్ = శ్రీకృష్ణుడు; ఉవాచ = పలికెను; అక్షరమ్ = వినాశంలేనిది, మూలకారణమైనది; పరమమ్ = పరమమైన; బ్రహ్మ = బ్రహ్మం; స్వభావః = అది ప్రతిదేహంలో ప్రత్యగాత్మ భావాన్ని పొందడమే; అధ్యాత్మమ్ = అధ్యాత్మమని; ఉచ్యతే = చెప్పబడుతోంది; భూత భావ ఉద్భవకరః = జీవుల సృష్టి స్థితులకు కారణమైన; విసర్గః = యజ్ఞంలో దేవతలను ఉద్దేశించి ద్రవ్యాదులను అర్పించడమే; కర్మ సంజ్ఞితః = కర్మమని చెప్పబడుతోంది.
తా ॥ శ్రీభగవానుడు పలికెను: (నిత్యుడైన జీవుని కంటే) పరమమైన మూలకారణమే* బ్రహ్మం అనబడుతోంది. (ఇది అంశరూపంలో ప్రతిదేహంలో ప్రవేశించే స్వభావమే)* అంటే జీవుడే అధ్యాత్మం* అనబడుతున్నాడు. జీవుల జన్మ, స్థితులకు కారణమైన ద్రవ్యత్యాగ రూపమైన యజ్ఞమే కర్మ అనబడుతోంది.* (మొదటి మూడు ప్రశ్నలకు ప్రత్యుత్తరం)