జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే ।
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖీలమ్ ॥ 29
జరామరణ మోక్షాయ, మామ్, ఆశ్రిత్య, యతంతి, యే,
తే, బ్రహ్మ, తత్, విదుః, కృత్స్నమ్, అధ్యాత్మమ్, కర్మ, చ, అఖీలమ్.
జరా మరణ మోక్షాయ = ముదిమి, చావుల నుండి విడివడడానికి; మామ్ = నన్ను(పరమేశ్వరుని); ఆశ్రిత్య = ఆశ్రయించి; యే = ఎవరు; యతంతి = సాధన చేస్తున్నారో; తే = వారు; తత్ = ఆ; బ్రహ్మ = బ్రహ్మాన్ని; కృత్స్నమ్ = సమగ్రంగా; అధ్యాత్మమ్ = ప్రత్యగాత్మ విషయాన్ని; అఖీలం చ = సమస్తాన్ని; కర్మ = తత్సాధనభూతాలైన కర్మను; విదుః = ఎరుగుతారు (తెలిసికొనగలరు).
తా ॥ (ఈ విధంగా వారు నన్ను భజిస్తూ, తెలుసుకోదగిన దానిని అంతా తెలుసుకుని కృతార్థులవుతున్నారు.) జరామరణాల నుండి ముక్తులు కాగోరి ఎవరు నన్ను ఆశ్రయించి సాధన చేస్తున్నారో వారు పరబ్రహ్మాన్ని, (తత్ప్రాప్తికి తోడైన దేహాది వ్యతిరిక్తమూ, శుద్ధమూ అయిన) ఆత్మను, (తత్సాధనభూతాలైన) కర్మలనన్నింటినీ (సరహస్యంగా) గ్రహించగలుగుతున్నారు.