అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః ।
పరం భావమజానంతః మమావ్యయమనుత్తమమ్ ॥ 24
అవ్యక్తమ్, వ్యక్తిమ్, ఆపన్నమ్, మన్యంతే, మామ్, అబుద్ధయః,
పరమ్, భావమ్, అజానంతః, మమ, అవ్యయమ్, అనుత్తమమ్.
అబుద్ధయః = అవివేకులు; మమ = నా; అవ్యయమ్ = అక్షయమూ; అనుత్తమమ్ = ఉత్కృష్టమూ; పరమ్ = సర్వకారణరూపమూ, శ్రేష్ఠమూ అయిన; భావమ్ = స్వరూపాన్ని; అజానంతః = ఎఱుగక; అవ్యక్తమ్ = నామ రూపాతీతుడనైన; మామ్ = నన్ను; వ్యక్తిమ్ = రూపాదిని; ఆపన్నమ్ = పొందిన వానిగా; మన్యంతే = తలచుతున్నారు.
తా ॥ (పరిశ్రమ సమానమే అయినా ఫలవైషమ్యం ఎక్కుగా తోస్తున్నందున, అందరూ కూడా అన్యదేవతలను విడిచి నిన్నే భజింపకున్నారేమి? అని అంటావా:) అల్పబుద్ధులైనవారు నిత్యమూ, సర్వోత్తమమూ అయిన నా స్వరూపాన్ని గ్రహించక, ప్రపంచాతీతుణ్ణి (విశుద్ధసత్త్వ ప్రధానమూర్తులను పెక్కింటిని జగద్రక్షణార్థం లీలగా పరిగ్రహించే వాణ్ణి) అయిన నన్ను దేహవిశిష్టునిగా (అంటే, మత్స్యకూర్మాది రూపాలలో వ్యక్తమైన దేవతాంతరంగా) భావిస్తున్నారు. (కనుక, నన్ను సేవించక ఇతర దేవతలను ఆరాధించి అంతవంతాలైన ఫలాలను పొందుతున్నారు) (గీత : 9–11 చూ:)