అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ ।
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ॥ 23
అంతవత్, తు, ఫలమ్, తేషామ్, తత్, భవతి, అల్పమేధసామ్,
దేవాన్, దేవయజః, యాంతి, మద్భక్తాః, యాంతి, మామ్, అపి.
తు = కాని; అల్పమేధసామ్ = అల్పబుద్ధులైన; తేషామ్ = వారి; తత్ఫలమ్ = ఆ ఫలం; అంతవత్ = అంతం గలది (అశాశ్వతం); భవతి = అవుతోంది; దేవయజః = దేవోపాసకులు; దేవాన్ = దేవతలను; యాంతి = పొందుతున్నారు; మద్భక్తాః అపి = నా భక్తులు మరి; మామ్ = నన్ను; యాంతి = పొందుతున్నారు.
తా ॥ (ఈవిధంగా సర్వదేవతలును నా స్వరూపమే అయినా, వారి ఆరాధన నా ఆరాధనయే అయినా, ఫలప్రదాతను కూడా నేనే అయి ఉన్నా; వారికీ సాక్షాత్ నా భక్తులైన వారికీ ఫలవైషమ్యం ఉంది:) అల్పబుద్ధులైన వ్యక్తుల ఆరాధనా లబ్ధమైన ఆ ఫలం (నాచే ఒసగబడినదే అయినా) అశాశ్వతం. దేవతోపాసకులు (వినాశయుక్తులైన) దేవతలనే పొందుతున్నారు. మరి నా భక్తులు మాత్రం, అనాది, అనంతుడు, పరమానందరూపి అయిన నన్ను (భగవంతుని) పొందుతున్నారు. (గీత : 9–25 చూ:)