తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థం అహం స చ మమ ప్రియః ॥ 17
తేషామ్, జ్ఞానీ, నిత్యయుక్తః, ఏక భక్తిః, విశిష్యతే,
ప్రియః, హి, జ్ఞానినః, అత్యర్థమ్, అహమ్, సః, చ, మమ, ప్రియః.
తేషామ్ = ఈ నలుగురిలో; నిత్యయుక్తః = సర్వదా నాయందు సమాహితుడైనవాడూ; ఏకభక్తిః = ఏకనిష్ఠుడు(మన్నిష్ఠుడును); జ్ఞానీ = తత్త్వజ్ఞుడూ అయినవాడు; విశిష్యతే = శ్రేష్ఠుడు; హి = ఏమన; అహమ్ = నేను; జ్ఞానినః = జ్ఞానికి; అత్యర్థమ్ = అత్యంతం; ప్రియః = ప్రియమైనవాణ్ణి; సః చ = అతడు కూడా; మమ = నాకు; ప్రియః = ప్రీతిపాత్రుడు.
తా ॥ ఈ నలుగురు భక్తులలో నిత్యయుక్తుడూ, ఏకనిష్ఠుడూ అయిన తత్త్వజ్ఞానియే శ్రేష్ఠుడు; ఎందుకంటే నేను జ్ఞానికి అత్యంత ప్రియమైనవాణ్ణి, జ్ఞాని కూడా నాకు అత్యంత ప్రియమైనవాడు.
వ్యాఖ్య:-
గత శ్లోకంలో నాలుగు రకాల భక్తుల (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని) గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వారిలో ఎవరు అందరికంటే గొప్పవారు? అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇస్తున్నారు. అందరికంటే “జ్ఞాని” యే ఉత్తముడు. మిగతా ముగ్గురిలో (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి) లేని రెండు ప్రత్యేకమైన గుణాలు జ్ఞానిలో ఉన్నాయి. అవే (1)నిత్యయుక్తత్వం, (2)ఏకభక్తి.
ఈ రెండు గొప్ప లక్షణాలు ఉండటం వల్లే జ్ఞాని అందరికంటే శ్రేష్ఠుడయ్యాడు.
(1) నిత్యయుక్తత్వం అంటే ఎల్లప్పుడూ (నిరంతరం) దేవుడితో కనెక్ట్ అయి ఉండటం. జ్ఞాని 24 గంటలూ, ప్రతి క్షణం ఆత్మ ధ్యానంలోనే ఉంటాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడిని మర్చిపోడు. అందుకే ఇతను ‘నిత్యయుక్తుడు’. ఆర్తుడు (కష్టాల్లో ఉన్నవాడు), జిజ్ఞాసువు (తెలుసుకోవాలనుకునేవాడు), అర్థార్థి (డబ్బు కోరేవాడు)… వీళ్లు దేవుడిని పూజిస్తారు, కానీ ఎప్పుడు? కేవలం అవసరం ఉన్నప్పుడు లేదా కొంత సమయం మాత్రమే. మిగతా సమయాల్లో ప్రాపంచిక పనుల్లో పడి దేవుడిని మర్చిపోతుంటారు. అందుకే వీరు ‘అనిత్యయుక్తులు’ (Part-time devotees). ఒక గదిలో నిరంతరం దీపం వెలుగుతూ ఉంటే, చీకటి లోపలికి రాలేదు. జ్ఞాని మనసులో ఎప్పుడూ దైవధ్యానం అనే వెలుగు ఉంటుంది కాబట్టి, ‘మాయ’ (చీకటి) అతని దరిచేరదు. కానీ మిగతా ముగ్గురు మధ్యలో గ్యాప్ ఇస్తారు (దేవుడిని మర్చిపోతారు). ఆ గ్యాప్లో మాయ (అజ్ఞానం) మనసులో దూరిపోయే ప్రమాదం ఉంది. సాధన కొత్తలో ఎవరూ 24 గంటలు దేవుడిని తలచుకోలేరు. అది సహజం. మొదట్లో కొద్దిసేపు ధ్యానం చేస్తూ, మిగతా టైంలో పనులు చేసుకోండి. కానీ రాను రాను… దేవుడి కోసం కేటాయించే సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. చివరికి “ఏ పని చేస్తున్నా మనసు దేవుడి మీదే ఉండే” ఆ నిత్యయుక్త స్థితిని చేరుకోవాలి. అందుకే భగవంతుడు ఇలా ఎప్పుడూ తనతోనే ఉండే జ్ఞానికి క్లాస్లో “ఫస్ట్ ర్యాంక్” (First Mark) ఇచ్చారు.
(2) జ్ఞాని ఎందుకు గొప్పవాడు అంటే, అతనిలో ఉండే రెండో గొప్ప లక్షణం “ఏకభక్తి”. భక్తి అంటే ఇక్కడ ప్రేమ లేదా ఆసక్తి అని అర్థం. జ్ఞానికి 5 రకాల భక్తులు, 9 రకాల భక్తులు లేదా 100 రకాల భక్తులు ఉండవు. కేవలం ఒకే ఒక్క దానిపై భక్తి ఉంటుంది. అదే పరమాత్మ (లేదా ఆత్మ). దేవుడిని తప్ప అతడు వేరే దేన్నీ ప్రేమించడు. ప్రపంచంలో సాధారణ మనుషుల భక్తి ముక్కలైపోయి ఉంటుంది. కొందరికి డబ్బు మీద భక్తి. కొందరికి కీర్తి (పేరు) మీద భక్తి. కొందరికి పదవి (Power) మీద భక్తి. కొందరికి కుటుంబం మీద లేదా సుఖభోగాల మీద భక్తి. ఇలా మనసు అనేక విషయాల వైపు లాగబడుతూ, చంచలంగా (Stable గా లేకుండా) ఉంటుంది. ఇలాంటి మనసుతో ధ్యానం చేయడం కుదరదు. జ్ఞాని మనసు మాత్రం అనేక దిక్కులకు వెళ్లదు. కేవలం ఒక్క భగవంతుడి మీద మాత్రమే (ఆత్మ మీదే) నిలిచి ఉంటుంది. వేరే ఏ వస్తువు మీదా అతని దృష్టి చెదరదు. వంద విషయాల మీద మనసు పారేసుకోకుండా, ఒకే ఒక్క దైవంపై మనసు లగ్నం చేయడం వల్లే.. భగవంతుని దృష్టిలో భక్తులందరిలోనూ జ్ఞానికే అగ్రతాంబూలం (First Place) దక్కింది.
జ్ఞానికి దేవుడంటే సాదాసీదా ఇష్టం కాదు. ‘అత్యర్థం’ అంటే ‘అమితమైన’ లేదా ‘కొలవలేనంత’ ప్రేమ అని అర్థం. ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ ఈ రోజు ఉండి రేపు పోయేవే (నశించేవే) అని జ్ఞానికి బాగా తెలుసు. అందుకే అతను వాటిని ప్రేమించడు. ఎప్పటికీ నాశనం లేకుండా శాశ్వతంగా ఉండే ఆ దేవుడిని మాత్రమే మనసారా ప్రేమిస్తాడు. ఇది ఒక వైపు ఉండే ప్రేమ (One-way love) కాదు. భక్తుడు దేవుడిని ఎంత గాఢంగా ప్రేమిస్తాడో, దేవుడు కూడా ఆ భక్తుడిని అంతే ఎక్కువగా ప్రేమిస్తాడు. “అతను నాకు చాలా ఇష్టమైనవాడు (స చ మమ ప్రియః)” అని దేవుడే స్వయంగా చెప్పుకున్నాడు. నలుగురూ మనల్ని మెచ్చుకుంటే.. ఏదో చిన్న చిన్న లాభాలు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అవి కొన్నాళ్లే ఉంటాయి. కానీ దేవుడికి మనం నచ్చితే.. ఆయన మనకు ‘మోక్షాన్ని’ (శాశ్వత ఆనందాన్ని) బహుమతిగా ఇస్తాడు. అందుకే, మనుషుల మెప్పు కోసం పాకులాడటం కంటే, దేవుడికి ప్రియమైన వారిగా మారడానికి ప్రయత్నించాలి. అదే మన జన్మకు నిజమైన అదృష్టం, సార్థకత.
ఈ శ్లోకంలో జ్ఞానికి ‘ఏకభక్తి’ ఉంటుంది అని చెప్పడం ద్వారా ఒక గొప్ప సత్యాన్ని బయటపెట్టారు. అదేంటంటే.. భక్తి, జ్ఞానం వేరు వేరు కాదు, రెండూ ఒక్కటే. రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి:
- జ్ఞానికి భక్తి ఉంటుంది: దేవుడి గొప్పతనం పూర్తిగా తెలిసినవాడే (జ్ఞాని) ఆయనను ఎక్కువగా ప్రేమించగలడు.
- భక్తునికి జ్ఞానం ఉంటుంది: దేవుడిని గాఢంగా ప్రేమించేవాడికి, ఆయన గురించిన జ్ఞానం వాటంతట అదే కలుగుతుంది.
చాలామంది “జ్ఞాన మార్గం గొప్పదా? భక్తి మార్గం గొప్పదా?” అని వాదించుకుంటారు. కానీ నిజానికి ఒకదానికొకటి తీసిపోవు. రెండూ సమానమే. కొండ ఎక్కేటప్పుడు దారులు వేరుగా కనిపించవచ్చు. కానీ, సాధనలో పరాకాష్టకు (చివరి దశకు) చేరుకున్నప్పుడు.. భక్తి అన్నా, జ్ఞానం అన్నా, ధ్యానం అన్నా అన్నీ ఒకటే అయిపోతాయి. పేర్లు వేరైనా అనుభవం ఒక్కటే!