చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినోఽర్జున ।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ॥ 16
చతుర్విధాః, భజంతే, మామ్, జనాః, సుకృతినః, అర్జున,
ఆర్తః, జిజ్ఞాసుః, అర్థ అర్థీ, జ్ఞానీ, చ, భరతర్షభ.
భరతర్షభ = భరతశ్రేష్ఠా; అర్జున = పార్థా; చతుర్విధాః = నాలుగు రీతులైన; సుకృతినః = పుణ్యాత్ములైన; జనాః = జనులు; ఆర్తః = ఆపదలలో చిక్కుకున్నవాడు; జిజ్ఞాసుః = తత్త్వజ్ఞానార్థి; అర్థ అర్థీ = ఇహపరలోకాల ధనసుఖాలను కోరువాడు; జ్ఞానీ చ = జ్ఞాని (అనువారు) మామ్ = నన్ను; భజంతే = భజిస్తున్నారు.
తా ॥ భరతశ్రేష్ఠా! అర్జునా! ఆపదలలో చిక్కుకున్నవాడు, తత్త్వజిజ్ఞాసువు, అర్థకామి, తత్త్వజ్ఞాని అనే పుణ్యాత్ములు నలుగురు నన్ను భజిస్తున్నారు.
వ్యాఖ్య:–
ఇంతకుముందు శ్లోకాల్లో దేవుడిని నమ్మని వారి గురించి (దుర్మార్గుల గురించి) చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడిని సేవించే మంచివారి గురించి ఇక్కడ చెబుతున్నారు. ప్రధానంగా నాలుగు రకాల మనుషులు దేవుడిని ఆశ్రయిస్తారట:
- ఆర్తుడు: కష్టాల్లో ఉన్నవాడు (రోగాలు, బాధలు వచ్చినప్పుడు “దేవుడా కాపాడు” అని వేడుకునేవాడు).
- జిజ్ఞాసువు: అసలు ఈ దేవుడంటే ఎవరు? ఈ సృష్టి ఏంటి? అని నిజం తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాడు.
- ధనార్థి (అర్థార్థి): డబ్బు, పదవులు, సుఖాలు కావాలని కోరుకునేవాడు.
- జ్ఞాని: సత్యం తెలిసినవాడు (మోక్షం కోరేవాడు).
ఈ నలుగురూ ఏదో ఒక రకంగా, ఏదో ఒక అవసరం కోసమైనా దేవుడిని తలుచుకుంటున్నారు. అందుకే వీరందరూ పుణ్యాత్ములే (మంచివారే) అని చెప్పారు. అందరూ దేవుడి దగ్గరకు వచ్చినా… వారు ఏ కారణం చేత (ఏ కోరికతో) వచ్చారు అనే దాన్ని బట్టి వారిలో తేడాలు ఉంటాయి. (ఉదాహరణకు: డబ్బు కోసం వచ్చిన వాడి భక్తి వేరు, జ్ఞానం కోసం వచ్చిన వాడి భక్తి వేరు).
భక్తులలో మొదటి రకం ‘ఆర్తుడు’. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే: వీరికి ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు, జబ్బు చేసినప్పుడు, లేదా దొంగల వల్లే, జంతువుల వల్లే ప్రాణభయం కలిగినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. అప్పటిదాకా దేవుడి గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, ఆపద రాగానే “ఏడుకొండలవాడా! కాపాడు”, “నీకు అది ఇస్తా, ఇది ఇస్తా” అంటూ మొక్కులు మొక్కడం, ముడుపులు కట్టడం మొదలుపెడతారు. సమాజంలో చాలామంది జనం ఈ రకానికి చెందినవారే ఉంటారు. సుఖంగా ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోయి, కష్టాల్లో మాత్రమే దేవుడిని ఆశ్రయిస్తారు. కారణం ఏదైనప్పటికీ, ‘కష్టం’ అనే సాకుతోనైనా వారు భగవంతుడిని తలుచుకుంటున్నారు కాబట్టి, వీరిని కూడా ‘పుణ్యాత్ముల’ (మంచివారి) జాబితాలోకే చేర్చారు.
రెండవ రకం భక్తుడు ‘జిజ్ఞాసువు’. జిజ్ఞాసువు అంటే.. “అసలు దేవుడంటే ఎవరు? ఆయన తత్వం ఏంటి? ఈ సృష్టి రహస్యం ఏమిటి?” అని తెలుసుకోవాలనే తీవ్రమైన ఆసక్తి (Curiosity) ఉన్నవాడు. ప్రపంచంలో కోట్లాది మంది జనం ఉన్నా, దేవుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది కంటికి కనిపించే వస్తువుల మీద, డబ్బు మీద, లౌకిక విషయాల మీదే పరిశోధనలు (Research) చేస్తారు, సమయం గడుపుతారు. దేవుడి గురించి అసలు పట్టించుకోరు. కొందరైతే అసలు దేవుడే లేడని వాదిస్తుంటారు. అలాంటి ఈ ప్రపంచంలో.. దేవుడి గురించి తెలుసుకోవాలనే కోరిక పుట్టడమే చాలా గొప్ప విషయం. అందుకే వీరు కూడా పుణ్యాత్ములే. వీరు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినట్టే. సాధన చేస్తూ వీరు ఉన్నత స్థితికి వెళ్తారు. గీతలో కృష్ణుడు చెప్పినట్లు.. “యోగం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాడు కూడా, కర్మకాండల ఫలితాలను దాటిపోతాడు”. ఇలాంటి దైవ జిజ్ఞాస (ఆసక్తి) అంత తేలికగా రాదు. ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఉంటేనే మనిషికి ఆ బుద్ధి పుడుతుంది.
మూడవ రకం భక్తుడు ‘అర్థార్థి’ (‘అర్థ’ అంటే ధనం అని అర్థం). వీరి కోరిక ప్రాపంచికమైనదే (డబ్బు) కావచ్చు. కానీ, ఆ కోరిక తీరడానికి వారు దేవుడినే అడుగుతున్నారు తప్ప, చెడ్డ మార్గాల్లో వెళ్లడం లేదు. ఆ వంకతోనైనా దేవుడిని ఎప్పుడూ తలుచుకుంటున్నారు కాబట్టి, వీరిని కూడా ‘పుణ్యాత్ములు’గానే పరిగణించారు. కేవలం డబ్బు, ఆస్తులు, ఐశ్వర్యం, లగ్జరీ జీవితం కావాలని దేవుడిని పూజించేవారు. “దేవుడి దయ ఉంటే నా వ్యాపారం పెరుగుతుంది, నాకు ఆస్తులు కలిసి వస్తాయి” అని కేవలం సంపద పెంచుకోవడం కోసమే వీరు దేవుడిని ప్రార్థిస్తారు.
నాలుగవ రకం భక్తుడు ‘జ్ఞాని’. ఇతను మిగతా ముగ్గురి కంటే చాలా ప్రత్యేకమైనవాడు. దేవుడి తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు. ఆత్మ ఏదో, అనాత్మ (శరీరం/ప్రపంచం) ఏదో స్పష్టంగా తెలిసిన వివేకవంతుడు. ఇతను ఆర్తుడిలా కష్టాలు తీర్చమని అడగడు, అర్థార్థిలా డబ్బు కావాలని అడగడు. అసలు ఏ కోరికా లేకుండా, కేవలం ఆ దేవుడి మీద ప్రేమతో, ఆత్మధ్యానంలో మునిగి ఉంటాడు. ఎలాంటి స్వార్థం లేకుండా కొలుస్తాడు కాబట్టి, ఈ నలుగురిలో జ్ఞాని అంటేనే నాకు చాలా ఇష్టం అని భగవంతుడు తర్వాతి శ్లోకంలో చెప్పబోతున్నారు.
పురాణాలలోని ఉదాహరణలు: ఈ నాలుగు రకాల భక్తులు ఎవరో అర్థం చేసుకోవడానికి మన పురాణాల నుంచి చక్కటి ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:
- ఆర్తులు (కష్టాల్లో పిలిచినవారు):
- గజేంద్రుడు: మొసలి పట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని పిలిచాడు.
- ద్రౌపది (వస్త్రాపహరణ సమయంలో).
- జిజ్ఞాసువులు (తెలుసుకోవాలని కోరినవారు):
- పరీక్షిత్తు మహారాజు: చనిపోయే ముందు దైవజ్ఞానం కోసం అడిగాడు.
- ఉద్ధవుడు: కృష్ణుడిని జ్ఞానోపదేశం చేయమని కోరాడు.
- అర్థార్థులు (కోరికలు కోరినవారు):
- సుగ్రీవుడు: రాజ్యం కోసం, భార్య కోసం రాముడిని ఆశ్రయించాడు.
- ధ్రువుడు: తండ్రి ఒడిలో స్థానం (పదవి) కోసం తపస్సు చేశాడు (చివరికి జ్ఞానిగా మారాడు).
- జ్ఞానులు (నిష్కామ భక్తులు):
- శుక మహర్షి, సనక సనందనాదులు, నారదుడు, భీష్ముడు, ప్రహ్లాదుడు. వీరు ఏమీ ఆశించకుండా దేవుడిని ప్రేమించినవారు.
కారణం ఏదైనా సరే.. వీరందరూ దేవుడిని ఆశ్రయించారు కాబట్టి అందరూ గొప్పవారే (పుణ్యాత్ములే).