యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే ।
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ॥ 12
యే, చ, ఏవ, సాత్త్వికాః, భావాః, రాజసాః, తామసాః, చ, యే,
మత్తః, ఏవ, ఇతి, తాన్, విద్ధి, న, తు, అహమ్, తేషు, తే, మయి.
యే చ ఏవ = మరియు, సమస్తమైన ఏ; సాత్త్వికాః = సాత్త్వికాలైన; భావాః = పదార్థాలూ; యే చ = మరియు ఏ సమస్త; రాజసాః = రాజసిక పదార్థాలూ; తామసాః = తామసిక పదార్థాలూ; (కలవో); తాన్ = వాటన్నిటిని; మత్తః ఏవ = నా నుండే కలిగినవి; ఇతి = అని; విద్ధి = తెలుసుకో; తు = కాని; అహమ్ = నేను; న తేషు = వాటి అధీనుడను కాను; తే = అవి అన్నీ కూడా; మయి = నా ఆధీనాలు.
తా ॥ జీవులలో సాత్త్విక రాజసిక తామసికాలైన (శమదమాదులు, హర్షదర్పాలు, శోక మోహాలు అయిన) ఏయే భావాలు వారివారి కర్మల చేత కలుగుతున్నాయో, వాటిని నా నుండి కలిగిన వాటిగానే తెలుసుకో. అవి నా నుండే కలిగినా కూడా, నేను వాటికి ఆధీనుడను కాను, అవే నా ఆధీనంలో ఉన్నాయి.