ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ॥ 6
ఏతత్ యోనీని, భూతాని, సర్వాణి, ఇతి, ఉపధారయ,
అహమ్, కృత్స్నస్య, జగతః, ప్రభవః, ప్రలయః, తథా.
సర్వాణి భూతాని = చేతనాచేతనాలైన సమస్త భూతాలనూ; ఏతత్ యోనీని = ఉభయవిధాలైన ఈ ప్రకృతి నుండి కలిగినవి; ఇతి = అని; ఉపధారయ = తెలుసుకో; (కనుక) అహమ్ = నేను; కృత్స్నస్యజగతః = సమస్త జగత్తుకు; ప్రభవః = ఉత్పత్తి స్థానాన్ని; తథా = అదే విధంగా; ప్రలయః = ప్రళయకారణాన్ని.
తా ॥ (పర-అపర ప్రకృతులను వర్ణించి వాటి ద్వారా తన సృష్టి కారణాన్ని వర్ణిస్తున్నాడు:) ఈ నా ఉభయ విధ ప్రకృతి నుండి జడ-చేతనాత్మకాలైన (క్షేత్రక్షేత్రజ్ఞ రూపమైన) సర్వభూతాలు జనిస్తున్నాయి –అని గ్రహించు. (జడ ప్రకృతి దేహరూపంలో పరిణతమై క్షేత్రం అవుతోంది. నా అంశయైన చేతనప్రకృతి భోక్తృరూపంలో దేహంలో ప్రవిష్టమై, స్వకర్మ చేత దేహాన్ని ధరిస్తూ జీవుడు అని అనబడుతోంది. ఈ రెండు ప్రకృతులూ నా నుండి కలిగినవే. కనుక -) నేను సప్రకృతికమైన సమస్త జగత్తుకు సృష్టి ప్రళయాలకు కారణభూతుణ్ణి.