భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ॥ 4
భూమిః, ఆపః, అనలః, వాయుః, ఖమ్, మనః, బుద్ధిః, ఏవ, చ,
అహంకారః, ఇతి, ఇయమ్, మే, భిన్నా, ప్రకృతిః, అష్టధా.
భూమిః = పృథ్వి; ఆపః = నీరు; అనలః = అగ్ని; వాయుః = గాలి; ఖమ్ = ఆకాశం; మనః = సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు; బుద్ధిః = నిశ్చయాత్మికమైన బుద్ధి; అహంకారః ఏవ చ = ‘నేను’ అనే అహంకారం; ఇతి = అని; ఇయమ్ = ఈ; మే = నా; ప్రకృతిః = మాయాశక్తి; అష్టధా = ఎనిమిది విధాలుగ; భిన్నా = విభక్తము.
తా ॥ (ఈవిధంగా శ్రోతయైన అర్జునుణ్ణి ఏకాగ్రచిత్తుణ్ణి చేసి, ప్రకృతి సహాయంతో సృష్టినొనర్చు ఈశ్వరతత్త్వాన్ని నిరూపింపగోరి, ముందుగా ప్రకృతిని వర్ణిస్తున్నాడు 🙂 భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని ఎనిమిది విధాలుగా నా మాయాశక్తి విభజించబడింది.