శ్రీ భగవానువాచ :
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః ।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ॥ 1
మయి, ఆసక్త మనాః, పార్థ, యోగమ్, యుంజన్, మదాశ్రయః,
అసంశయమ్, సమగ్రమ్, మామ్, యథా, జ్ఞాస్యసి, తత్, శృణు.
పార్థ = అర్జునా; మయి = నాయందు; ఆసక్త మనాః = లగ్నచిత్తుడవూ; మదాశ్రయః =నా శరణాగతుడవూ అయి; యోగమ్ = యోగాన్ని; యుంజన్ = అభ్యసిస్తూ; మామ్ = నా; సమగ్రమ్ = ఐశ్వర్యాది సంపన్నమైన పూర్ణస్వరూపాన్ని; అసంశయమ్ = నిస్సంశయంగా; యథా = ఎట్లు; జ్ఞాస్యసి = తెలిసికొనగలవో; తత్ = దానిని; శృణు = విను.
తా ॥ (పూర్వాధ్యాయాంతంలో ‘మద్గతచిత్తుడై నన్ను భజించేవాడు యోగులందరిలోనూ శ్రేష్ఠుడు’ అని చెప్పబడింది. భక్తిభాజనుడవైన నీ స్వరూపం ఎటువంటిది? అనే ప్రశ్నను అపేక్షించి, స్వస్వరూపాన్ని నిరూపిస్తూ-) శ్రీభగవానుడు పలికెను: పార్థా! సర్వవిధాల నా శరణాగతుడవై, ఎటువంటి ఫలాలను అపేక్షించకుండా నా యందు మనస్సును నిలిపి యోగాన్ని అభ్యసిస్తూ, (విభూతి బలశక్త్యైశ్వర్యాది సంపన్నమైన) నా పూర్ణస్వరూపాన్ని నిస్సంశయంగా తెలుసుకోగలిగే రీతిని చెప్పెదను విను.