శ్రీ భగవానువాచ :
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ॥ 1
అనాశ్రితః, కర్మఫలమ్, కార్యమ్, కర్మ, కరోతి, యః,
సః, సన్న్యాసీ, చ, యోగీ, చ, న, నిరగ్నిః, న, చ, అక్రియః.
శ్రీభగవాన్ = శ్రీకృష్ణుడు; ఉవాచ = పలికెను కర్మఫలమ్ = కర్మఫలాన్ని; అనాశ్రితః = ఆశించనివాడై; కార్యం కర్మ = కర్తవ్య కర్మను, నిత్యకర్మలను; యః = ఎవడు; కరోతి = ఒనర్చునో; సః = అతడు; సన్న్యాసీ = సన్న్యాసి; యోగీ చ = యోగియూ; న నిరగ్నిః = అగ్నిహోత్ర త్యాగి కాదు; న చ అక్రియః = తపోదానాదికర్మలను త్యజించేవాడు కాదు.
తా ॥ (కర్మలు దుఃఖరూపాలవడం చేత జనులు హఠాత్తుగా వాటిని త్యజించవచ్చు. దీనిని వారించడానికి, సన్న్యాసం కంటే కర్మయోగమే శ్రేష్ఠమని స్తుతిస్తూ -)శ్రీభగవానుడు పలికెను: కర్మఫలాలను అపేక్షించకుండా, ఎవడు అవశ్య కర్తవ్యాలుగా విధించబడిన (నిత్య) కర్మలను (ధ్యానయోగాంగంగా) ఆచరిస్తాడో, అతడే సన్న్యాసి, అతడే యోగి. అగ్నిసాధ్యాలైన (ఇష్ట) కర్మలను, అగ్న్యపేక్షలేని (పూర్త) తపోదానాది కర్మలను (మాత్రమే) త్యజించేవాడు సన్న్యాసి కాడు, యోగి కూడా కాడు.