యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ।
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ॥ 35
యత్, జ్ఞాత్వా, న, పునః, మోహమ్, ఏవమ్, యాస్యసి, పాండవ,
యేన, భూతాని, అశేషేణ, ద్రక్ష్యసి, ఆత్మని, అథో, మయి.
పాండవ = అర్జునా; యత్ = దేనిని; జ్ఞాత్వా = గ్రహించి; పునః = మళ్ళీ; ఏవమ్ = ఇటువంటి; మోహమ్ = మోహాన్ని; న యాస్యసి = పొందవో; యేన = దేనిచేత; అశేషేణ = నిరవశేషంగా; (బ్రహ్మాదిస్థావర పర్యంతం); భూతాని = ప్రాణులను; ఆత్మని = నీ యందు; అథ = మరియు; మయి = నా యందూ; ద్రక్ష్యసి = చూడగలవో; (తద్విద్ధి = దానిని తెలుసుకో)
తా ॥ అర్జునా! ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మళ్ళీ నీకు ఇటువంటి మోహం కలుగదు. ఆ జ్ఞానం చేత నీవు, బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ) నుండి స్థావరం వరకూ గల ప్రాణులన్నింటినీ నీలోనూ, నాయందూ చూడగలవు* . (గీత: 6–29, 30 చూ.)