యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ॥ 22
యదృచ్ఛా లాభ సంతుష్టః, ద్వంద్వాతీతః, విమత్సరః,
సమః, సిద్ధౌ, అసిద్ధౌ, చ, కృత్వా, అపి, న, నిబధ్యతే.
యదృచ్ఛాలాభసంతుష్టః = అప్రార్థితములూ, అనాయాసలబ్ధములూ అయిన వానిచే సంతుష్టుడూ; ద్వంద్వాతీతః = సుఖదుఃఖాదులను అతిక్రమించినవాడు; విమత్సరః = అసూయారహితుడూ, నిర్వైరుడు; సిద్ధౌ = లాభంలో; అసిద్ధౌ చ = అలాభంలో; సమః = సమబుద్ధి కలవాడు; కృత్వాపి = కర్మను ఆచరించినా; న నిబధ్యతే = బద్ధుడు కాడు.
తా ॥ యదృచ్ఛాలాభ సంతుష్టుడూ, శీతోష్ణాది ద్వంద్వరహితుడూ, మాత్సర్యరహితుడూ, లాభాలాభాలలో సమబుద్ధి గలవాడూ అయిన పురుషుడు విహితమైన కర్మలను గాని లేక స్వాభావికములైన శరీర రక్షణాదిక కర్మలను గాని ఆచరించినప్పటికీ కర్మబద్ధుడు కాడు.