వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ॥ 10
వీతరాగ భయక్రోధాః, మన్మయాః, మామ్, ఉపాశ్రితాః,
బహవః, జ్ఞాన తపసా, పూతాః, మద్భావమ్, ఆగతాః.
వీత రాగ భయ క్రోధాః = ఆసక్తి, భయం, కోపం వీడినవారూ; మన్మయాః = నన్నే భావించేవారూ; మామ్ = నన్ను; ఉపాశ్రితాః = ఆశ్రయించినవారూ; బహవః = పెక్కుమంది; జ్ఞానతపసా = పరమాత్మ జ్ఞానమనే తపస్సు చేత; పూతాః = శుద్ధులై; మద్భావమ్ = నా స్వరూపాన్ని; ఆగతాః = పొందారు.
తా ॥ (జన్మకర్మలను ఎరిగితే ఈశ్వరుణ్ణి పొందుతారు అని చెప్పబడింది. దాని క్రమం చెప్పబడుతోంది – నేను శుద్ధ సత్త్వావతారాలను దాల్చి, ధర్మపాలన చేస్తానని గ్రహించి నా పరమకారుణ్యాన్ని ఎరిగి) ఆసక్తిని, భయాన్ని, కోపాన్ని వీడి; నాయందు సమాహిత చిత్తులై, నన్ను శరణుజొచ్చిన వ్యక్తులు పెక్కుమంది ఆత్మజ్ఞానమనే తపస్సు చేత శుద్ధులై నా స్వరూపాన్ని పొందారు. (ఒక్క చైతన్యమే ఉపాధిభేదంతో ఈశ్వరుడూ, జీవుడూ కూడా. ఈశ్వరప్రసాదంతో జీవుని అజ్ఞానం తొలగితే శుద్ధ చైతన్యమే అవుతాడు.)