ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ॥ 43
ఏవమ్, బుద్ధేః, పరమ్, బుద్ధ్వా, సంస్తభ్య, ఆత్మానమ్, ఆత్మనా,
జహి, శత్రుమ్, మహాబాహో, కామరూపమ్, దురాసదమ్.
మహాబాహో = అర్జునా; ఏవమ్ = ఈ విధంగా; ఆత్మనా = పవిత్రం చేయబడిన బుద్ధితో; ఆత్మానమ్ = మనస్సును; సంస్తభ్య = స్థిరమొనర్చి; బుద్ధేః = బుద్ధికి; పరమ్ = సాక్షియైన ఆత్మను; బుద్ధ్వా = తెలిసికొని; దురాసదమ్ = దుర్విజ్ఞేయగతి, దుర్జయమైన; కామరూపమ్ = కామం అనే; శత్రుమ్ = శత్రువును; జహి = నిర్మూలించు.
తా ॥ అర్జునా! ఈ విధంగా నిశ్చయాత్మికమైన బుద్ధితో మనస్సును సమాహితమొనర్చి, బుద్ధి కంటే వేరుగా ఉండే ద్రష్టయైన ఆత్మను తెలుసుకుని, దుర్జయమైన కామం అనే శత్రువును నిర్మూలించు.