ధూమేనావ్రియతే వహ్నిర్యథాఽదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్ ॥ 38
ధూమేన, ఆవ్రియతే, వహ్నిః, యథా, ఆదర్శః, మలేన, చ,
యథా, ఉల్బేన, ఆవృతః, గర్భః, తథా, తేన, ఇదమ్, ఆవృతమ్.
ధూమేన = పొగచే; వహ్నిః = నిప్పు; యథా = ఏ విధంగా; ఆవ్రియతే = కప్పబడుతోందో; మలేన చ = మాలిన్యం చేత; ఆదర్శః = అద్దం; యథా = ఏవిధంగా అయితే; ఆవ్రియతే = కప్పబడుతోందో; ఉల్బేన = మావి చేత; గర్భః =గర్భస్థ పిండం; యథా = ఏ విధంగా; ఆవృతః = కప్పబడుతోందో; తథా = అదే విధంగా; తేన = కామం చేత; ఇదమ్ = ఈ జ్ఞానం, వివేక బుద్ధి; ఆవృతమ్ = కప్పబడి ఉంది.
తా ॥ పొగచేత నిప్పు, మురికిచేత అద్దం, మావిచేత గర్భస్థ పిండం కప్పబడే విధంగా, కామంచేత ఈ వివేకబుద్ధి ఆవృతమవుతోంది.
వ్యాఖ్య:-
ప్రతి జీవి హృదయంలోనూ ‘ఆత్మ’ ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది. కానీ, అది ‘కామము’ (కోరికలు) అనే పొరతో కప్పబడి ఉండటం వల్ల మన అనుభవానికి రావడం లేదు. ఈ విషయం స్పష్టంగా అర్థం కావడానికి భగవంతుడు ఇక్కడ మూడు చక్కని ఉదాహరణలు (దృష్టాంతాలు) చెప్పారు. ఆత్మ ఎలా కప్పబడి ఉందంటే:
- అగ్నిని పొగ కప్పేసినట్లు.
- అద్దం మీద దుమ్ము పేరుకుపోయినట్లు.
- కడుపులోని బిడ్డను మావి (గర్భ సంచి) కప్పేసినట్లు.
వివరణ:
- అగ్ని – పొగ: నిప్పు ఉన్నా సరే, దట్టమైన పొగ కప్పేస్తే ఆ నిప్పు కనిపించదు. పొగ నలుపు ఆ వెలుగును మింగేస్తుంది. కానీ, విసనకర్రతో ఆ పొగను చెదరగొడితే (ప్రయత్నం చేస్తే).. నిప్పు తన సహజమైన కాంతితో భగ్గున వెలుగుతుంది.
- అద్దం – దుమ్ము: అద్దం మీద దుమ్ము ఉంటే ప్రతిబింబం కనిపించదు. ఆ దుమ్మును తుడిచేస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది.
- శిశువు – మావి: బిడ్డ చుట్టూ ఉండే మావి పొరను తొలగిస్తేనే శిశువు బయటకు కనిపిస్తుంది.
అలాగే.. మన హృదయంలో ఆత్మ అనే వెలుగు ఉంది. దాన్ని కామము అనే పొర కప్పేసింది. భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే సాధనలతో ఆ కోరికల పొరను తొలగించాలి (దుమ్మును తుడిచినట్లు, పొగను విసిరినట్లు). అప్పుడు ఆత్మ మనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. అలా తెలుసుకోవడమే ‘మోక్షం’. అదే బంధాల నుండి విముక్తి.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అగ్నిని పొగ కప్పేసినంత మాత్రాన అగ్ని చెడిపోదు. అద్దం మీద దుమ్ము పడినంత మాత్రాన అద్దం పాడవదు. బిడ్డ చుట్టూ మావి ఉన్నంత మాత్రాన బిడ్డకు ఏమీ కాదు. అవన్నీ లోపల స్వచ్ఛంగా, నిర్మలంగానే ఉంటాయి. ఆ పైన ఉన్న పొర (ముసుగు) మాత్రమే అడ్డుగా ఉంటుంది. అలాగే.. మనల్ని అజ్ఞానం ఆవరించినా, కోరికలు (కామం) చుట్టుముట్టినా సరే.. మన లోపల ఉన్న ‘ఆత్మ’ యొక్క పవిత్రతలో ఏ మార్పు రాదు. అది ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. ముసుగు (ఆవరణ) ఉండటం వల్ల ఇంతకుముందు ఆత్మ మనకు అనుభవంలోకి రాలేదు. ఇప్పుడు ఆ ముసుగు తొలగింది కాబట్టి ఆత్మ కనిపిస్తోంది. అంతే తప్ప, వస్తువులో (ఆత్మలో) ఏ మార్పు జరగలేదు. కేవలం అడ్డుగోడ మాత్రమే తొలగించబడింది.
కాబట్టి సాధకులు చేయాల్సింది ఆత్మను కొత్తగా సృష్టించడం కాదు. తమ హృదయంలో పేరుకుపోయిన ‘కామం’ (కోరికలు) అనే ముసుగును గట్టి ప్రయత్నంతో (పురుష ప్రయత్నంతో), సాధనలతో పటాపంచలు చేయాలి. అప్పుడు సహజంగానే లోపల ఉన్న ఆత్మ వెలుగులు జిమ్ముతుంది. అలా తమ నిజస్వరూపాన్ని తెలుసుకుని జన్మను సార్థకం చేసుకోవాలి. ఈ శ్లోకంలో భగవంతుడు చెబుతున్న పరమ సత్యం ఇదే.
పైన చెప్పిన ఉదాహరణల్లో అసాధ్యమైనది ఏదీ లేదు. పొగను గాలివాల్తే తేలికగా పంపించేయవచ్చు. అద్దం మీద దుమ్మును సులభంగా తుడిచేయవచ్చు. గర్భంలోని పిండం చుట్టూ ఉన్న మావి కూడా సమయం రాగానే తొలగిపోతుంది. అలాగే, ఆత్మజ్ఞానాన్ని పొందడంలో కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. సోమరితనాన్ని వదిలి కాస్త ప్రయత్నం చేస్తే చాలు… కామం మొదలైన శత్రువులను ఖచ్చితంగా జయించవచ్చు.
క్రిందటి శ్లోకమున కామమును గూర్చి ప్రస్తావించినందు వలన ఈ శ్లోకమందలి ‘తేన’ అను పదమునకు ‘ఆ కామముచే ‘ అనియు (రాబోవు శ్లోకమున ‘ఈ కామముచే జ్ఞానము కప్పబడియున్నది ‘ అని తెలుపబడినందువలన) ‘ఇదమ్’ అను పదమునకు జ్ఞానమనియు అర్థమును భావించవలసియుండును.