ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥ 27
ప్రకృతేః, క్రియమాణాని, గుణైః, కర్మాణి, సర్వశః,
అహంకార విమూఢాత్మా, కర్తా, అహమ్, ఇతి, మన్యతే.
ప్రకృతేః = ప్రకృతికి అంటే బ్రహ్మశక్తియైన మాయకు చెందినవైన; గుణైః = త్రిగుణాలతో; సర్వశః = అన్ని విధాల; క్రియమాణాని = చేయబడుతోన్నవైన; కర్మాణి = కర్మలు; కర్తా = చేస్తున్న వాణ్ణి; అహమ్ = నేను; ఇతి = అని; అహంకారవిమూఢాత్మా = అహంకారంతో చెడిన మనస్సు గలవాడు; మన్యతే = తలుస్తాడు.
తా ॥ (‘జ్ఞానికి కూడా కర్మ కర్తవ్యమైతే మరి భేదమేమిటి’ అని అంటావా?) ప్రకృతికి చెందిన గుణత్రయము శరీరేంద్రియాది సంఘాతంగా పరిణమించి, లౌకిక వైదిక* కర్మలను నిర్వహిస్తోంది. కాని అహంకార–విమూఢ-చిత్తుడు* ‘కర్తను నేనే’ అని భావిస్తాడు.
వ్యాఖ్య:-
ప్రకృతి నుండి పుట్టిన సత్వ, రజ, తమో గుణాలే రకరకాలుగా మారి… మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, ఇంద్రియాలు వంటి ’24 తత్వాలు’గా ఏర్పడ్డాయి. కాబట్టి మన శరీరం, మనస్సు, బుద్ధి, మనకు కనిపించే ఈ ప్రపంచం.. ఇవన్నీ కూడా ప్రకృతి నుండి పుట్టినవే. మనం చేసే ప్రతి పనిని నిజానికి మన శరీరమే (ఉపాధి) చేస్తోంది. లోపల ఉన్న ‘ఆత్మ’ కేవలం సాక్షి లాంటిది (Witness). అది చూస్తుందే తప్ప ఏ పనీ చేయదు. నిజానికి మనిషి ఆత్మస్వరూపుడు. కానీ ఈ శరీరం, ఇంద్రియాలు, మనస్సు అనే పరికరాలు (Tools) మాత్రమే పనులు చేస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రకృతే అంతా నడిపిస్తోంది. కానీ, వివేకం లేని వాడు (అవివేకి) ఏమనుకుంటాడు? శరీరం మీద ఉన్న మమకారంతో.. “ఈ పని నేనే చేస్తున్నాను, నేనే కర్తను” అని భ్రమపడతాడు. “నేను శరీరాన్ని కాదు, ఆత్మను” అనే సత్యాన్ని (వివేకాన్ని) మర్చిపోతాడు. దేహమే తాను అనుకునే అహంకారం వల్ల, ప్రకృతి చేస్తున్న పనిని అనవసరంగా తన నెత్తి మీద వేసుకుంటాడు. ఇలా చేయని పనికి “నేనే చేశాను” అని బాధ్యత తీసుకోవడం వల్లే కర్మ బంధాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడం, కష్టసుఖాలు అనుభవించడం జరుగుతోంది. పని చేసేది ప్రకృతి (శరీరం/గుణాలు), చూసేది ఆత్మ. ఈ తేడా తెలియకపోవడమే బంధానికి కారణం.
జ్ఞానికి (తెలిసినవాడికి), అజ్ఞానికి (తెలియనివాడికి) మధ్య ఉన్న అసలైన తేడా ఇక్కడే ఉంది. అజ్ఞాని తన శరీరాన్ని, మనసును (ఉపాధిని) చూసి అదే ‘తాను’ అనుకుంటాడు. ఆ భ్రమలో పడి, ప్రకృతి చేసే పనులకు “నేనే చేస్తున్నాను (కర్తను), నేనే అనుభవిస్తున్నాను (భోక్తను)” అని బాధ్యత తన నెత్తి మీద వేసుకుంటాడు. అందుకే బాధలు పడతాడు. జ్ఞాని శరీరం వేరు, తాను వేరు అని స్పష్టంగా తెలుసుకుంటాడు. తాను ఆత్మనే తప్ప శరీరం కాదని గ్రహిస్తాడు. జరిగే పనులను కేవలం ఒక సాక్షిలా (Witness) గమనిస్తూ ఉంటాడు. “నేను చేస్తున్నాను” అనే భావన (కర్తృత్వం) లేకుండా పరమానందాన్ని అనుభవిస్తాడు. మనిషికి దుఃఖం కలగాలా లేక ఆనందం కలగాలా అనేది.. “నేను చేస్తున్నాను” అనే భావన ఉందా లేదా అనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ భావన ఉంది కాబట్టే అజ్ఞానికి అంతులేని దుఃఖం. ఆ భావన లేదు కాబట్టే జ్ఞానికి అంతులేని ఆనందం. కాబట్టి తెలివైన వాడు.. ప్రకృతి (శరీరం/గుణాలు) చేసే పనులను తన మీద వేసుకోకూడదు. “నేను కర్తను కాదు” అనే సత్యాన్ని గ్రహించి, తన నిజమైన ఆత్మ స్థితిలోనే నిలకడగా ఉండాలి.
“అహంకార విమూఢాత్మా” (అహంకారంతో నిండిన మూర్ఖపు బుద్ధి గలవాడు) అనే పదాన్ని బట్టి.. అహంకారం అనేది జీవుడికి ఎంత పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుందో స్పష్టంగా తెలుస్తోంది. అహంకారం అనేది మనిషిలో ఉండే వివేకాన్ని (మంచి చెడుల జ్ఞానాన్ని) పూర్తిగా నాశనం చేస్తుంది. మనిషిని మూర్ఖత్వంలోకి (విమూఢత్వంలోకి) నెట్టేస్తుంది. కాబట్టి, ఈ శరీరం మీద, ఇంద్రియాల మీద “నేను” అనే భావన (అహంభావం) ఎప్పుడూ పెంచుకోకూడదు. కేవలం ఆత్మ యందే “నేను” అనే భావన కలిగి ఉండాలి. దీనినే వేదాలు “అహం బ్రహ్మాస్మి” (నేనే బ్రహ్మమును – ఆత్మను) అని చెబుతున్నాయి. శరీరాన్ని నేను అనుకోవడం అజ్ఞానం, ఆత్మను నేను అనుకోవడం జ్ఞానం.
శ్రీరామకృష్ణులు: అది సరే, గర్వం, అహంకారం అనేది జ్ఞానంచే కలుగుతాయా లేక అజ్ఞానం చేతనా? అహంకారం తమోగుణం, అది అజ్ఞాన జనితం. అహంకారమనే ఈ తెర ఉన్నందుననే భగవంతుని గాంచలేకున్నాం. ‘నేను’ అనేది మరణిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. అహంకారం కలిగి ఉండటం నిష్ప్రయోజనం. ఈ దేహం, ఈ ఐశ్వర్యం ఏదీ శాశ్వతం కాదు. ఒక తాగుబోతు దుర్గాపూజ సమయంలో దుర్గాదేవి ప్రతిమను చూస్తూ ఉన్నాడు. ప్రతిమకు చేసిన అలంకారాలను చూసి అతడు, ‘అమ్మా, నువ్వు ఎంతగా అలంకరించుకున్నా, రెండు మూడు రోజులు తరువాత నిన్ను లాక్కెళ్ళి గంగలో పారవేస్తారు’ అన్నాడు. (అందరూ నవ్వారు) అందుకే అందరికీ చెబుతున్నాను. జడ్జిగా ఉన్నా సరే, మరెవరిగా ఉన్నాసరే, అన్నీ మూన్నాళ్ళ ముచ్చటే. కాబట్టి గర్వం, అహంకారం వదలిపెట్టి వేయాలి.
సత్వరజస్తమో గుణాలు వేర్వేరు స్వభావాలు గలవి. అహంకారం, నిద్ర, మితిమీరి తినటం, కామం, క్రోధం మొదలైనవి తమోగుణ స్వభావుల లక్షణాలు. రజోగుణ స్వభావులు అనేక కార్యకలాపాలలో పాల్గొంటారు; వారి దుస్తులు మెరుస్తూ, ఆడంబరంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా, పటాటోపంగా ఉంటుంది. ముంగిటి గదిలో క్వీన్ చిత్తరువు వ్రేలాడుతూ ఉంటుంది. పూజా సమయంలో పట్టుపీతాంబరాలు ధరిస్తారు. మెళ్ళో రుద్రాక్షమాల ఉంటుంది. ఆ మాల మధ్యమధ్య బంగారు రుద్రాక్ష మణులు గ్రుచ్చబడి ఉంటాయి. ఎవరైనా పూజాగృహాన్ని చూడవస్తే, తామే పిలుచుకుపోయి అన్నీ చూపిస్తారు; ‘ఇదుగో, ఈ వైపు రండి, ఇంకా ఉంది. తెల్ల చలువరాతితో చేసిన, పాలరాతితో చేసిన గచ్చు ఉంది, మనోరంజకంగా మలచబడిన మండపం ఉంది’ అంటూ వివరిస్తారు. పలువురు చూసేట్లు దానధర్మాలు చేస్తారు.
“సత్త్వగుణ స్వభావులు శాంతంగా ఉంటారు. దొరికిన వస్త్రాన్ని ధరిస్తారు. కడుపుకు సరిపడేటంత మేరకే సంపాదిస్తారు. పరులను ముఖస్తుతి చేసి ధనం గడించాలనుకోరు. ఇంటిని మరమ్మత్తు చేసుకోరు, పిల్లల దుస్తుల గురించి కలత చెందరు. పేరు ప్రతిష్ఠలను అపేక్షించరు. భగవత్ చింతన, దానం, ధ్యానం అన్నీ గుప్తంగానే జరిగిపోతాయి. ఎవరికీ ఏదీ తెలిసిరాదు. దోమతెరలో ధ్యానం చేస్తారు; ‘రాత్రి ఇతడు నిద్రపోలేదు కాబోలు! అందుకే ఉదయం ఇంతసేపటిదాకా నిద్రిస్తున్నాడు’ అని ఇతరులు అనుకుంటారు. సత్త్వగుణం అనేది మెట్లలో చివరి మెట్టు లాంటిది, తరువాతిది డాబాయే. సత్త్వగుణం గడించాక ఇక భగవద్దర్శనానికి జాప్యం ఉండదు. మరి కాస్త పురోగమిస్తే ఆయన్ను పొందవచ్చు. అందరూ సమానులే అని చెప్పారే! చూడండి ఎన్ని రకాల మనుష్యులు ఉన్నారో! (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
—–
విజయ్ (శ్రీరామకృష్ణులతో): మీరు ఆశీర్వదించండి. అప్పుడే వేదికపై కూర్చుని ఉపాసన నిర్వర్తిస్తాను.
శ్రీరామకృష్ణులు: అహంకారం తొలగిపోతేనే చాలు. ‘నేను లెక్చర్ ఇస్తున్నాను, మీరు వినండి’ అనే అహంకారం లేకుంటే చాలు. అహంకారం జ్ఞానం వలన కలుగుతుందా, అజ్ఞానం వలన వస్తుందా? అహంకార శూన్యునిలోనే జ్ఞానం ఉంటుంది. పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తుంది, ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి జారిపోతుంది.
“అహంకారం ఉన్నంత వరకు జ్ఞానమూ కలుగదు, ముక్తీ కలుగదు. మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చే తీరాలి. దూడ, ‘హంబా, హంబా’ (నేను, నేను) అంటూ అరుస్తుంది. అందుచేత దానికి ఎంత దుఃఖం! కసాయివాడు తెగనరుకుతాడు; తోలును చెప్పులుగా కుట్టుతారు, డోలు తయారుచేస్తారు. ఆ డోలును ఎంతగా వాయిస్తారు! దాని దుఃఖానికి అంతమే లేదు! చివరగా దాని ప్రేగులను దూది ఏకేవాడి వింటికి నారిగా ఉపయోగిస్తారు. దూది ఏకే సమయంలో అది ‘తుహూ! తుహూ!’ (నువ్వు, నువ్వు) అంటుంది. అప్పుడే దానికి శాంతి చేకూరేది. ఆ తరువాత అది ‘హంబా! హంబా!’ అని అరవదు, ‘తుహు, తుహు’ అనే అంటుంది. అంటే: ఓ భగవాన్, నువ్వే కర్తవు, నేను అకర్తను; నువ్వు యంత్రాన్ని నడిపేవాడవు, నేను యంత్రాన్ని; సర్వం నువ్వే.’
“గురు, బాబా (తండ్రి), కర్త – ఈ మూడు మాటలు వినేటప్పుడు నా ఒంట్లో ముల్లు గుచ్చుకొన్నట్లుగా ఉంటుంది. నేను ఆయన కుమారుణ్ణి, సదా ఆయన కుమారుడనే. అలాటప్పుడు నేను ‘బాబా’ నవటమా! భగవంతుడే కర్త, నేను కాదు; ఆయన యంత్రం నడిపేవాడు, నేను యంత్రాన్ని.
“ఎవరైనా నన్ను గురువని సంబోధిస్తే, ‘ఛీ మూర్ఖుడా, గురు వెవరు?’ అంటాను. సచ్చిదానందుడు తప్ప వేరే గురువు లేరు. ఆయన తప్ప మరో మార్గమే లేదు. ఆయన ఒక్కడే భవసాగరంలో మనలను తరింపచేసే సరంగు.
(విజయ్‌తో) “ ‘ఆచార్యత్వం’ వహించటం ఎంతో కష్టతరం. ఇందుచేత ఆ వ్యక్తి తనకు తానే కీడు వాటిల్ల చేసుకుంటాడు. పదిమంది గౌరవించటం చూసి కాలుపై కాలు వేసుకుని, ‘నేను బోధిస్తాను, మీరు వినండి’ అంటాడు. ఇది శోచనీయమైన ధోరణి, దాని లబ్ధి ఏదో కొంత ప్రశంస! అంతే. కొందరు, ‘ఆహా! విజయ్‌బాబు ఎంత బాగా ప్రసంగించాడు, ఆయన మహాజ్ఞాని’ అంటే అనవచ్చు. ‘నేను బోధిస్తున్నాను’ అని భావించవద్దు. నేను అమ్మతో, ‘అమ్మా! నువ్వు నడిపేదానవు, నేను యంత్రాన్ని; నువ్వు ఎలా చేయిస్తే అలా చేస్తాను. ఎలా పలికిస్తే అలా పలుకుతాను’ అంటూ ఉంటాను. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)