యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున ।
కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే ॥ 7
యః, తు, ఇంద్రియాణి, మనసా, నియమ్య, ఆరభతే, అర్జున
కర్మేంద్రియైః, కర్మయోగమ్, అసక్తః, సః, విశిష్యతే.
తు = కాని; అర్జున = అర్జునా; యః = ఎవడు; ఇంద్రియాణి = చక్షురాది జ్ఞానేంద్రియాలను; మనసా = వివేకయుక్తమైన మనస్సుతో; నియమ్య = నిగ్రహించి; అసక్తః = అనాసక్తుడై; కర్మేంద్రియైః = హస్తపాదాది కర్మేంద్రియాలతో; కర్మయోగమ్ = కర్మయోగాన్ని; ఆరభతే = ఆరంభిస్తాడో; సః = అతడు; విశిష్యతే = శ్రేష్ఠుడు.
తా ॥ కాని ఎవరైతే వివేకయుక్తమైన మనస్సుతో జ్ఞానేంద్రియాలను నియమించి, అనాసక్తుడై కర్మేంద్రియాలతో కర్మానుష్ఠానం ఒనర్చుతున్నాడో, అతడు చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతున్నాడు. (లేక, పైన చెప్పిన డాంభికుని కన్నా శ్రేష్ఠుడు).
వ్యాఖ్య:-
పై శ్లోకంలో లాగానే, ఇక్కడ కూడా ‘ఇంద్రియాణి’, ‘కర్మేంద్రియైః’ అనే పదాలు అన్ని ఇంద్రియాలను ఉద్దేశించి వాడబడ్డాయి. ఎందుకంటే, కేవలం కర్మేంద్రియాలతో (చేతులు, కాళ్లు మొదలైనవి) మాత్రమే చేసే కర్మయోగం అసంపూర్ణంగా ఉంటుంది.
మనిషి తన మనసును అదుపులో ఉంచుకుని (కోరికలను తొలగించుకుని), ఇంద్రియాలను జయించి, దేనిపైనా మమకారం లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా పనులు చేస్తే.. అతడు కర్మబంధాల్లో చిక్కుకోడు.
ముఖ్యమైన సూత్రం:
- ఇంద్రియాలు మనసు చెప్పినట్లు వినాలి.
- ఆ మనసు మన ఆధీనంలో ఉండాలి.
బంధమా? మోక్షమా? ఇంద్రియాలు పనులు చేస్తున్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు. మనసుకు వాటిపై ‘ఆసక్తి’ (Attachement) ఉందా లేదా అన్నదే ముఖ్యం.
- మనసుకు ఆసక్తి/మమకారం ఉంటే అది బంధం.
- ఆసక్తి లేకపోవడమే మోక్షం.
కాబట్టి ముందు మనసులో ఉన్న కోరికలను, మమకారాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఆ తర్వాత ఇంద్రియాలతో పనులు చేసినా ఎటువంటి దోషం అంటుకోదని భగవంతుడు చెబుతున్నారు. అందుకే గొప్పవారు ముందుగా మనోనిగ్రహాన్ని సాధించి, ఇంద్రియాలను తమ అదుపులోకి తెచ్చుకుంటారు. అలా పవిత్రమైన ఆ ఇంద్రియాలతో లోకానికి మేలు జరిగే పనులను (లోకహితం) చేస్తూ ఉంటారు.