న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ॥ 5
న, హి, కశ్చిత్, క్షణమ్, అపి, జాతు, తిష్ఠతి, అకర్మకృత్,
కార్యతే, హి, అవశః, కర్మ, సర్వః, ప్రకృతిజైః, గుణైః.
కశ్చిత్ = ఏ మనుజుడూ; క్షణమపి = క్షణమైనా కూడా; అకర్మకృత్ = ఏ పనిని చేయకుండా; జాతు = ఎన్నడునూ; నహి తిష్ఠతి = ఉండజాలడు; హి = ఏమన; ప్రకృతిజైః = ప్రకృతి నుండి కలిగిన; గుణైః = గుణాలచే; అవశః = అస్వాధీనుడై; సర్వః = ప్రతీవాడూ; కర్మ = కర్మను; కార్యతే = చేయువాడుగా ఒనర్పబడుతున్నాడు.
తా ॥ (కర్మత్యాగం అంటే అనాసక్తి, ఫలత్యాగం. కర్మలను త్యజించడం అసాధ్యం.) కర్మ ఒనర్చకుండా ఎవ్వరూ ఎన్నడూ ఒక క్షణమైన కూడా ఉండలేరు. అందరూ ప్రకృతి జనిత సత్వ-రజః-తమో గుణాలకు లోబడి కర్మలను చేసేవారగుచున్నారు. (గీత : 3–8; 18–11 చూ:)
వ్యాఖ్య:-
ఏ పనీ (కర్మ) చేయకుండా ఎవరూ ఒక్క క్షణం కూడా ఉండలేరు. గాలి పీల్చడం, తినడం, నడవటం, మాట్లాడటం… ఇవన్నీ కర్మలే. అసలు ఇవేవీ చేయకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండగలరా? అందుకే, ప్రతి ఒక్కరికీ కర్మ అనేది తప్పనిసరి అని భగవంతుడు చెబుతున్నాడు.
జ్ఞాని (ఆత్మజ్ఞానం పొందినవాడు) తప్ప మిగతా జీవులందరూ మాయకు, ప్రకృతికి లోబడే ఉంటారు. ఆ ప్రకృతి వల్ల పుట్టిన మూడు గుణాలకు (సత్త్వ, రజ, తమో గుణాలు) లోబడి మనిషి ప్రవర్తిస్తుంటాడు. కాబట్టి ఆ గుణాల ప్రభావం వల్ల, తన ప్రమేయం లేకుండానే (అవశుడై) అతడు కర్మలు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ ‘అందరూ’ (సర్వః) అంటే ‘జీవన్ముక్తులైన మహనీయులు తప్ప మిగతా వారు’ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే: ఆ మహనీయులు గుణాలకు అతీతమైన ఆత్మస్థితిని పొందినవారు. వారు గుణాలకు బానిసలు కారు, మాయ వారిని ఏమీ చేయలేదు. జీవన్ముక్తులైన వారికి కూడా శరీరం, ఇంద్రియాలు ఉంటాయి. అవి ప్రకృతిలో భాగమే. కాబట్టి వారి శరీరేంద్రియాలు తమ పనులు తాము సహజంగా చేస్తున్నప్పటికీ, ఆ జ్ఞానులు మాత్రం “నేను చేస్తున్నాను” అనే అహంకారం లేకుండా (అకర్తలుగా), దేనికీ అంటుకోకుండా (నిస్సంగంగా) సాక్షీభూతంగా ఉంటారు.
ప్రకృతికి, దాని గుణాలకు లోబడి ఉన్న అజ్ఞానులు కూడా, ఆ కారణం చేత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సొంత ప్రయత్నంతో మంచి పనులు చేస్తూ చెడు కర్మలను, పుణ్య కార్యాలతో పాపాలను తొలగించుకోవచ్చు. చేసే పనులన్నీ భగవంతుడికి అర్పణ అనే భావనతో, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా (నిష్కామంగా) చేస్తూ ఉంటే… క్రమంగా వారి మనస్సు కూడా నిర్మలమై, వారు కూడా మోక్షాన్ని పొందగలరు.