యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥ 48
యోగస్థః, కురు, కర్మాణి, సంగం, త్యక్త్వా, ధనంజయ,
సిద్ధ్యసిద్ధ్యోః, సమః, భూత్వా, సమత్వమ్, యోగః, ఉచ్యతే.
ధనంజయ = అర్జునా; యోగస్థః = యోగంలో స్థితమై; సంగమ్ = ఆసక్తిని; త్యక్త్వా = వీడి; సిద్ధ్యసిద్ధ్యోః = ప్రాప్తి, అప్రాప్తుల; సమః = సమభావం కలవాడవై; భూత్వా = ఉండి; కర్మాణి = కర్మలను; కురు = ఆచరించు; సమత్వమ్ = సమభావం; యోగః = యోగం (అని); ఉచ్యతే = చెప్పబడుతోంది.
తా ॥ ధనంజయా! కర్మఫలాలపై ఆసక్తిని పరిత్యజించి, (జ్ఞానకర్మల) సిద్ధి–అసిద్ధులలో సమభావాన్ని వహించి, యోగస్థుడవై (ఈశ్వరుణ్ణి ఆశ్రయించి) కర్మలను ఆచరించు. సిద్ధి–అసిద్ధులలో సమభావాన్ని వహించడాన్నే యోగం అని అంటారు.