వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన ।
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ॥ 41
వ్యవసాయాత్మికా, బుద్ధిః, ఏకా, ఇహ, కురునందన,
బహుశాఖా, హి, అనంతాః, చ, బుద్ధయః, అవ్యవసాయినామ్
కురునందన = అర్జునా; ఇహ = ఈ కర్మయోగంలో; వ్యవసాయాత్మికా = నిశ్చయాత్మికమైన; బుద్ధిః = జ్ఞానం; ఏకా ఇహ = ఏకనిష్ఠ అవుతుంది; హి = ఏమన; అవ్యవసాయినామ్ = చంచలచిత్తుల, సకాములగువారి; బుద్ధయః = బుద్ధులు, బహుశాఖాః = బహుశాఖలుగ విభక్తములు; అనంతాః చ = అనంతముఖములును.
తా ॥ (ఎలా రక్షిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానంగా నిష్కామ సకామ కర్మల భేదం నిరూపించబడుతోంది) కురునందనా! ఈ (ఈశ్వరారాధనా రూపమైన) నిష్కామ కర్మయోగంలో నిశ్చయరూపమైన బుద్ధి* ఏక నిష్ఠ అవుతుంది. కాని, చంచలచిత్తుల* బుద్ధులు అనంతాలూ, బహువిధాలూను. (ఈశ్వర ఆరాధనార్థం ఒనర్చే నిత్యనైమిత్తిక కర్మలలో ఒకింత అంగహానియైనా కూడా అవి వినష్టం కావు, వాటిని యథాసాధ్యంగా ఒనర్చవలెననియే విధి. దీనిలో ఎట్టి వైగుణ్యశంక లేనే లేదు. దీనిలో వైగుణ్యం ఉపశమిస్తుంది. కామ్యకర్మల రీతి ఇటువంటిది కాదు, కనుక ఈ రెంటికి గల భేదం చాల గొప్పది.)