స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ॥ 31
స్వధర్మమ్, అపి, చ, అవేక్ష్య, న, వికంపితుమ్, అర్హసి,
ధర్మ్యాత్, హి, యుద్ధాత్, శ్రేయః, అన్యత్, క్షత్రియస్య, న, విద్యతే.
స్వధర్మం అపి చ = మరియు స్వధర్మాన్ని కూడా; అవేక్ష్య = చూచి; వికంపితుమ్ = చలించడానికి; న అర్హసి = తగవు; హి = ఏలనన; ధర్మ్యాత్ యుద్ధాత్ = ధర్మయుద్ధం కంటే; క్షత్రియస్య = క్షత్రియునికి; అన్యత్ = మరొక; శ్రేయః = మేలైనది; న విద్యతే = లేదు.
తా ॥ మరియు (నీకు రోమాంచితమవడం అయుక్తం.) స్వధర్మాన్ని బట్టి చూస్తే, నీకు చలించడం తగదు. (ఆత్మ అవినాశి, యుద్ధం క్షాత్రధర్మం) ఏలనన, ధర్మయుద్ధం కంటే (ఈ యద్ధంలో నీకు ఏ శ్రేయం లేదని అన్నావు) క్షత్రియునికి మేలైనది వేరొకటి లేదు.
వ్యాఖ్య:-
విధి నిర్వహణ (Duty) పట్ల, తన ధర్మాన్ని పాటించడం పట్ల, ధర్మానికి విరుద్ధం కాని పనులు చేయడం పట్ల శ్రీకృష్ణుడికి ఎంత ఇష్టమో ఈ శ్లోకం వల్ల తెలుస్తోంది.
శరీరం ఉన్నంత వరకూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయక తప్పదు. అలాంటప్పుడు, తన ధర్మానికి తగిన పనిని… ఫలితం ఆశించకుండా (నిష్కామంగా) చేయడం వల్ల మనిషికి గొప్ప మేలు జరుగుతుంది. అంతేకాక, మనసు శుద్ధి అయ్యి మోక్షం కూడా లభిస్తుంది.
ఇక్కడ ‘ధర్మ్యాత్’ అని చెప్పడం వల్ల, క్షత్రియుడు ధర్మబద్ధమైన యుద్ధాన్నే ఆశ్రయించాలి తప్ప, అధర్మమైన యుద్ధాన్ని కాదని స్పష్టం చేయబడింది.