దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత ।
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ॥ 30
దేహీ, నిత్యమ్, అవధ్యః, అయమ్, దేహే, సర్వస్య, భారత,
తస్మాత్, సర్వాణి, భూతాని, న, త్వమ్, శోచితుమ్, అర్హసి.
భారత = అర్జునా; సర్వస్య = ప్రతి ఒక్కరి; దేహే = శరీరమందున్న; అయమ్ దేహీ = ఈ ఆత్మ; నిత్యమ్ = ఎల్లప్పుడూ; అవధ్యః = చంపశక్యం కానిది; తస్మాత్ = కనుక; త్వం = నీవు; సర్వాణి భూతాని = సకల జీవులకొరకు; శోచితుమ్ = శోకించడానికి; న అర్హసి = తగవు.
తా ॥ ఓ భారతా! సమస్తప్రాణుల దేహాలలో ప్రకాశిస్తున్న ఆత్మ సదా అవధ్యం. కనుక, ఏ ప్రాణికి కలిగే దేహనాశాన్ని గురించి దుఃఖీంచడం నీకు తగదు.
వ్యాఖ్య:-
శరీరం చంపబడినా, ఆ శరీరంలో ఉండే ఆత్మ మాత్రం చంపబడదు. ‘దేహి’ (దేహంలో ఉండేవాడు) అని అనడం వల్ల, ఆత్మ శరీరంలోనే ఉంటూ, ఆ శరీరాన్ని గమనించే సాక్షిగా ప్రకాశిస్తున్నాడని అర్థం.
‘నిత్యం’ (ఎప్పుడూ) అని చెప్పడం వల్ల, ఈ నిజం ఏదో ఒక కాలానికి మాత్రమే వర్తించేది కాదని, ఏ కాలంలోనైనా సరే ఆత్మను చంపడం ఎవరికీ సాధ్యం కాదని (ఆత్మ అవధ్యుడని) తెలుస్తోంది.
ఈ శ్లోకంలో ‘సర్వ’ అనే పదాన్ని రెండుసార్లు వాడారు – ‘సర్వస్య’, ‘సర్వాణి భూతాని’ అని. దీన్ని బట్టి… అది ఏ జాతి దేహమైనా, ఏ మతానికి చెందినదైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, జంతువైనా, చెట్టు పుట్ట అయినా సరే… సమస్త ప్రాణుల దేహాలలోనూ ఆత్మ నివసిస్తోందని, అందరిలోనూ సమానంగా ఉంటుందని స్పష్టమవుతోంది. సామాన్య ప్రజలు శరీరం చనిపోతున్నప్పుడు గానీ, రోగం వచ్చినప్పుడు గానీ, బాధ కలుగుతున్నప్పుడు గానీ… ‘తామే చనిపోతున్నాం’, ‘తామే బాధపడుతున్నాం’ అని అనుకుని దుఃఖిస్తూ ఉంటారు. అలా అనుకోవడం చాలా పొరపాటని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. శరీరం బాధపడినా, చనిపోయినా… ఆ శరీరంలో ఉండే ఆత్మ (అంటే నిజమైన తాను) ఏ మాత్రమూ బాధపడదు, చనిపోదు. ఈ సత్యం కదిలేవి, కదలనివి అయిన సమస్త ప్రాణుల దేహాలకూ వర్తిస్తుంది. కాబట్టి ఇక దుఃఖించడానికి అసలు చోటే లేదని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు.
దీన్ని బట్టి దుఃఖం పోవడానికి ఒకే ఒక మార్గం ఉంది – ‘నేను శరీరాన్ని కాదు, శరీరంలో ఉండే ఆత్మను’ అని అనుకోవడమే. ‘నేను శరీరాన్ని’ అనే భావన వల్ల దుఃఖం, ‘నేను ఆత్మను’ అనే భావన వల్ల దుఃఖం లేని స్థితి జీవులకు కలుగుతుంటాయి. కాబట్టి తెలివైనవాడు (విజ్ఞుడు) ఎప్పుడూ ‘నేను ఆత్మనే’ అని భావన చేస్తూ ఉండాలి.
“భారత” = ‘భా’ అంటే కాంతి (జ్ఞానం), ‘రతః’ అంటే ఆసక్తి కలవాడు అని అర్థం. ‘ఓ అర్జునా! ఇలాంటి ఆత్మజ్ఞానం అనే కాంతి యందే నువ్వు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండు. దేహాభిమానం అనే చీకటిలో మునిగిపోకు’ అని హెచ్చరించడానికేమో ‘భారత’ అని పిలిచి ఉండవచ్చు.