వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ॥ 22
వాసాంసి, జీర్ణాని, యథా, విహాయ, నవాని, గృహ్ణాతి, నరః, అపరాణి,
తథా, శరీరాణి, విహాయ, జీర్ణాని, అన్యాని, సంయాతి, నవాని, దేహీ.
నరః = మనుష్యుడు; యథా = ఏ విధంగా; జీర్ణాని = జీర్ణమైన; వాసాంసి = వస్త్రాలను; విహాయ = వదిలి; అపరాణి = అన్యమైన; నవాని = నూతన (వస్త్రాలను); గృహ్ణాతి = గ్రహిస్తాడో; తథా = అదే విధంగా; దేహీ = ఆత్మ; జీర్ణాని = జీర్ణమైన; శరీరాణి = దేహాలను; విహాయ = త్యజించి; అన్యాని = ఇతరమైన; నవాని = నూతన (దేహాలను); సంయాతి = పొందుతుంది.
తా ॥ (ఆత్మ అవినాశియే కాని, తత్–శరీర నాశం గురించే దుఃఖీస్తున్నాను, అని అంటావా:) మనుజుడు జీర్ణమైన వస్త్రాలను పరిత్యజించి ఇతర నూతన వస్త్రాలను ధరించే విధంగా, జీవాత్మ కూడా జీర్ణించిన దేహాలను వీడి, నూతన దేహాలను పొందుతోంది. (కర్మ భోగార్థం ఈ నూతన దేహాల ప్రయోజనం ఉంది కాబట్టి, దుఃఖీంప పని లేదు.)
వ్యాఖ్య:-
భగవద్గీతలో కృష్ణుడు కొన్ని చక్కటి ఉదాహరణలతో (పోలికలతో) బోధిస్తాడు. ఇలా ఉదాహరణలు చెప్పడం వల్ల సామాన్యులకు కూడా విషయం బాగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా అలాంటి ఒక పోలికనే చెప్పారు. మనం చాకలి వాడికి మురికి బట్టలు వేసేటప్పుడు ఎవరూ ఏడవరు. అలాగే ఆకురాలు కాలంలో చెట్ల ఆకులు రాలిపోతుంటే ఎవరూ బాధపడరు. ఎందుకంటే మళ్ళీ కొత్తవి వస్తాయనే ధైర్యం ఉంటుంది. మరణం కూడా అంతే అని భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. మరణం అంటే పాడైపోయిన శరీరాన్ని వదిలేయడమే. జీవుడు తన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటాడు. కాబట్టి చావు గురించి దుఃఖించాల్సిన పనిలేదని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అయితే, జ్ఞానాన్ని సంపాదించుకుని, కర్మలన్నింటినీ నాశనం చేసుకుని… ఇక మళ్ళీ జన్మ, మరణం అనేవే లేకుండా చేసుకోవడమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం అని భగవంతుడు ముందు ముందు వివరిస్తాడు.
‘శరీరాణి’ (శరీరాలు) అని బహువచనం వాడారు, దీన్నిబట్టి… జ్ఞానం అనే అగ్నితో కర్మలన్నీ కాలిపోకపోతే, జీవుడు ఇంకా అనేక జన్మలు ఎత్తాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.
‘జీర్ణాని’ (జీర్ణమైన/చిరిగిపోయిన) అనే పదానికి కేవలం ముసలి శరీరం అని కాకుండా, ‘ప్రారబ్ధ కర్మ అయిపోయిన శరీరం’ అని అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ ముసలితనంలోనే చనిపోవడం లేదు కదా. యవ్వనంలో, చిన్నతనంలో కూడా చనిపోతున్నారు. అప్పుడు వాళ్ళ శరీరాలు కొత్తగా, గట్టిగానే ఉంటాయి కానీ పాడైపోయి ఉండవు.
‘దేహీ’ (దేహంలో ఉండేవాడు) అని చెప్పడం వల్ల, మరణం కేవలం దేహానికే తప్ప, అందులో ఉండే ఆత్మకు కాదని స్పష్టమవుతోంది.
శరీరాలు (ఉపాధులు) మారుతున్నా, వాటిని గమనించే సాక్షి అయిన ఆత్మ మాత్రం కొంచెం కూడా మారదు. అది ‘అచలోయం సనాతనః’ (కదలనిది, ఎప్పటినుంచో ఉన్నది) అన్నట్లు నిశ్చలంగా ఉంటుంది. అదే జీవుడి నిజమైన స్వరూపం తప్ప, ఈ శరీరం కాదు.