న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ॥ 20
న, జాయతే, మ్రియతే, వా, కదాచిత్,
న, అయమ్, భూత్వా, అభవితా, వా, న, భూయః,
అజః, నిత్యః, శాశ్వతః, అయమ్, పురాణః,
న, హన్యతే, హన్యమానే, శరీరే.
అయమ్ = ఈ ఆత్మ; కదాచిత్ = ఒకప్పుడు; న జాయతే = జన్మించడం లేదు; న వా మ్రియతే = మరణించడం లేదు; భూత్వా = ఒకప్పుడుండి; భూయః = మళ్ళీ; అభవితా = ఉండనిది; న = కాదు; (కనుక ఆత్మకు మృత్యువు లేదు) న భూత్వా = ఒకప్పుడుండక; భూయః = మరల; భవితా వా = కలుగునది; న = కాదు; (కనుక ఆత్మకు జన్మ లేదు) అయమ్ = ఈ ఆత్మ; అజః = జన్మరహితమైనది; శరీరే = దేహం; హన్యమానే = హతమౌతున్నా; న హన్యతే = చంపబడదు; నిత్య = మృత్యువు లేనిది; శాశ్వతః = నాశం లేనిది; పురాణః = వృద్ధి లేనిది.
తా ॥ ఈ ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు. ఏలనన, పూర్వం ఉండకుండా తరువాత ఉండడమే జన్మ; పూర్వం ఉండి తరువాత ఉండకపోవడమే మృత్యువు. ఆత్మకు ఈ రెండూ లేవు. అంటే, ఆత్మకు జనన మరణాలు లేవు. శరీరం నశించినప్పటికీ ఈ ఆత్మ వినష్టం కాదు.
వ్యాఖ్య:-
ఈ శ్లోకాన్ని పోలిన శ్లోకం కఠోపనిషత్తులో (Katha Upanishad 1.2.18) కూడా ఉంది. భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారాంశమే అని చెప్పడానికి ఇలాంటి వాక్యాలే నిదర్శనం.
శరీరం నశించినా ఆత్మ నశించదు అని చెప్పడం ద్వారా… ఆత్మ అనేది శరీరానికి వేరుగా, సాక్షిగా (గమనించేదిగా) ఉందని స్పష్టమవుతోంది. కాబట్టి మనిషి నశించిపోయే శరీరమే ‘నేను’ అని అనుకోకుండా… నాశనం లేని ఆత్మే ‘తాను’ అని ఎప్పుడూ భావిస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల అంతులేని ధైర్యం, ఆనందం కలుగుతాయి. భయం లేని స్థితి వస్తుంది. చావు భయం పటాపంచలైపోతుంది.
అశాశ్వతమైన శరీరం (వితంతువు – బంగారు మురుగులు)
ఒక భక్తురాలు సాంసారికజీవితం గడుపుతూ మంచిగృహిణిగా, భర్తకు సేవలు చేస్తూ ఉండేది. పిల్లలను ప్రేమగా పెంచేది. అదే సమయంలో మనస్సును భగవంతుడి పైన నిలిపేది.
అకస్మాత్తుగా ఆమె భర్త చనిపోయాడు. భర్త శరీరాన్ని దహనం చేశాక ఆమె తన మట్టిగాజుల్ని పగులకొట్టి, వాటికి బదులు ఒక జత బంగారు మురుగులను ధరించింది. అసహజమైన ఆమె ప్రవర్తన చూసి అందరూ నివ్వెరపోయారు. కానీ వారితో ఆమె ఈ విధంగా చెప్పింది: “ఇంతవరకూ నా భర్త శరీరం మట్టిగాజులలాగా ఏ క్షణంలో అయినా పగిలిపోయే స్వభావం కలిగి ఉండేది. ఆ అశాశ్వతమైన భౌతికశరీరం పోయింది. ఇప్పుడు ఆత్మ రూపంలో ఉన్న ఆయన శరీరం ఎటువంటి మార్పులకు గురికాదు. పరిపూర్ణమైనదిగా మారిపోయింది. ఇప్పుడు దానికి నాశనం లేదు. అందుకనే నేను పగిలిపోయే మట్టిగాజులను వదిలివేసి శాశ్వతంగా ఉండే బంగారు మురుగులను వేసుకున్నాను.”