య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ ।
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ॥ 19
యః, ఏనమ్, వేత్తి, హంతారమ్, యః, చ, ఏనమ్, మన్యతే, హతమ్,
ఉభౌ, తౌ, న, విజానీతః, న, అయమ్, హంతి, న, హన్యతే.
యః = ఎవడు; ఏనమ్ = ఈ ఆత్మను; హంతారమ్ = చంపు దానిగా; వేత్తి = తలుస్తాడో; యః చ = మఱియు ఎవడు; ఏనమ్ = దీనిని; హతమ్ = చంపబడే దానిగా; మన్యతే = తలచునో; తౌ ఉభౌ = ఆ ఇరువురూ; (తత్త్వాన్ని); న విజానీతః = ఎరుగని వారు; (ఏలనన) అయం = ఈ ఆత్మ; న హంతి = చంపదు; న హన్యతే = చంపబడదు.
తా ॥ [ముందు చెప్పబడిన శ్లోకాల ద్వారా భీష్మాదుల మృతిని గూర్చి శోకం నివారించబడింది, ఇక ఆత్మను హంతగా తలచి ‘వీరిని చంపగోరను’ (అ. 1 శ్లో. 34) అనే దుఃఖవైఖరి కూడా అయుక్తమే!] ఎవరు ఈ ఆత్మను నిహంతగా తలచుచున్నారో, మఱియు ఎవరు ఈ ఆత్మను హంతగా తలచుచున్నారో, ఆ ఉభయులు కూడా ఆత్మస్వరూపాన్ని ఎరుగరు. ఈ ఆత్మ దేనినీ చంపదు; దేనిచేత కూడా చంపబడదు. ఈ ఆత్మ, అవికారి.
(గీత. 13 – 31; 18 -17 చూ.)