శ్రీ భగవానువాచ :
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ ।
అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున ॥ 2
కుతః, త్వా, కశ్మలమ్, ఇదమ్, విషమే, సముపస్థితమ్,
అనార్యజుష్టమ్, అస్వర్గ్యమ్, అకీర్తకరమ్, అర్జున.
శ్రీభగవాన్ = శ్రీకృష్ణుడు; ఉవాచ = పలికెను; అర్జున = అర్జునా; విషమే = సంకటసమయంలో; కుతః = ఎక్కడ నుండి; అనార్యజుష్టమ్ = ఆర్యులు కాని వారు పొందునదీ; అస్వర్గ్యమ్ = స్వర్గ గతిరోధకము; అకీర్తికరమ్ = అపకీర్తిదాయకమైన; ఇదమ్ = ఈ; కశ్మలమ్ = మోహము; త్వా = నీకు; సముపస్థితమ్ = దాపురించినది?
తా ॥ శ్రీభగవానుడు పలికెను: అర్జునా! ఈ సంకట సమయంలో, ఆర్యులకు తగనిదీ, స్వర్గగతికి ప్రతిబంధకమూ, అపకీర్తిదాయకమూ అయిన ఈ మోహం నీకు ఎలా దాపురించింది?
వ్యాఖ్య:-
“కశ్మలమిదమ్” – పిరికితనం, దుఃఖం, మనసులో ఆందోళన… వీటిని భగవంతుడు ‘కశ్మలం’ (మురికి లేదా మాలిన్యం) అని పిలిచాడు. శరీరానికి దుమ్ము ఎలా అంటుకుంటుందో, అలాగే మనసుకు కూడా దుఃఖం, వ్యామోహం, రాగద్వేషాలు అనే మురికి అంటుకుంటుంది. వంటి మీద మురికిని సబ్బు, సున్నిపిండితో ఎలా కడిగేస్తామో… అలాగే మనసులోని మురికిని ఆత్మజ్ఞానం అనే బోధనతో పోగొట్టుకోవాలి. శ్రీకృష్ణుడు చేయబోయే ఆ దివ్యమైన జ్ఞానోపదేశంతో అర్జునుడికి పట్టిన ఆ మాలిన్యం (విషాదం) త్వరలో తొలగిపోనుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ మనసు లోతుల్లోకి తొంగి చూసుకుని, అక్కడ పేరుకుపోయిన అజ్ఞానం అనే మురికిని… భగవద్గీత బోధ అనే చీపురుతో తుడిచివేయాలి.
“అనార్యజుష్టమ్” (అనార్యులు చేసే పని) – ప్రపంచంలో రెండే రెండు రకాల మనుషులు ఉంటారు: ఆర్యులు, అనార్యులు. మంచి మార్గంలో నడిచేవారు, పవిత్రంగా ఉండేవారు, వెలుగును (జ్ఞానాన్ని) కోరుకునేవారు, ధైర్యం, ఉత్సాహంతో ఉండేవారు… వీళ్లంతా ‘ఆర్యులు’. చెడు దారిలో వెళ్ళేవారు, అపవిత్రంగా, మనసు నిండా మురికితో ఉండేవారు, చీకటిని (అజ్ఞానాన్ని) ఇష్టపడేవారు, పిరికితనం, నిరుత్సాహం, ఎప్పుడూ భయంతో బతికేవారు… వీళ్లంతా ‘అనార్యులు’. తాము ఆర్యుల జాబితాలో ఉన్నారా, లేక అనార్యుల జాబితాలో ఉన్నారా అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకుని… ఎప్పుడూ ఆర్యులుగా (ఉత్తములుగా) ఉండటానికే ప్రయత్నించాలి.