ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్ఠతి నేంగతే ॥ 23
ఉదాసీనవత్, ఆసీనః, గుణైః, యః, న, విచాల్యతే,
గుణాః, వర్తంతే, ఇతి, ఏవ, యః, అవతిష్ఠతి, న, ఇంగతే.
ఉదాసీనవత్ = తటస్థునివలె; ఆసీనః = ఉన్నవాడై; యః = ఎవడు; గుణైః = గుణములచేత; న విచాల్యతే = చలింపడో; గుణాః = గుణాలు; వర్తంతే = స్వకార్యాలలో వర్తిల్లుతున్నాయి; ఇతి = అని; ఏవమ్ = ఇలా (గ్రహించి); యః = ఎవడు; అవతిష్ఠతి = వెలయుచుండునో (మరి); న ఇంగతే = చలింపడో (అతడు గుణాతీతుడు);
తా ॥ (గుణాతీతుని పరసంవేద్య లక్షణాలు, ఆచారాలు చెప్పబడుతున్నాయి) ఎవడు ఉదాసీనుని వలే సాక్షీభూతుడై వెలయుచు, గుణకార్యాలైన సుఖదుఃఖాల చేత చలించకుండా, స్వరూపప్రచ్యుతినొందక, గుణాలు స్వకార్యాలలో ప్రవర్తిల్లుతున్నాయి,* వీటితో నాకు సంబంధం లేదు అనే వివేకజ్ఞానంతో తూష్ణీంభూతుడై ఒప్పుచు చలించకుండా ఉంటాడో – అతడు గుణాతీత పురుషుడు. (గీత : 3-28 చూ.)