అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ ।
భూతభర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥
అవిభక్తమ్, చ, భూతేషు, విభక్తమ్, ఇవ, చ, స్థితమ్,
భూతభర్తృ, చ, తత్, జ్ఞేయమ్, గ్రసిష్ణు, ప్రభవిష్ణు, చ.
తత్ = ఆ; జ్ఞేయమ్ = బ్రహ్మం; భూతేషు = సర్వభూతాలలో; అవిభక్తం చ = కారణస్వరూపంలో అభిన్నమే అయినా; విభక్తం ఇవ చ = కార్యస్వరూపంలో భిన్నమైన దానివలె; స్థితమ్ = వెలయుచున్నది; భూతభర్తృ చ = మరియు, అది భూతాలను పాలిస్తోంది; గ్రసిష్ణు = సంహర్త; ప్రభవిష్ణు చ = సృష్టికర్త కూడా;
తా ॥ ఈ బ్రహ్మం సర్వభూతాలలో కారణరూపంలో అభిన్నంగానూ, కార్యరూపంలో (సముద్రజాతాలైన ఫేన బుద్బుదాదులు సముద్రం కంటే వేరు కాకపోయినా, వేరైనట్ల్లు తోచే విధంగా) భిన్నంగానూ ప్రతీతమవుతోంది. ఇదియే భూతాలనన్నింటినీ స్థితికాలంలో పోషిస్తోంది, ప్రళయకాలంలో సంహరిస్తున్నది, సృష్టికాలంలో ప్రభవింపజేస్తోంది.