అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః ।
మామాత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః ॥ 18
అహంకారమ్, బలమ్, దర్పమ్, కామమ్, క్రోధమ్, చ, సంశ్రితాః,
మామ్, ఆత్మ పరదేహేషు, ప్రద్విషంతః, అభ్యసూయకాః.
(వారు) అహంకారమ్ = సర్వానర్థాలకూ మూలమైన అభిమానాన్ని; బలమ్ = పరపీడాదాయకమైన శక్తిని; దర్పమ్ = ధర్మోల్లంఘన కారణమైన గర్వాన్ని; కామమ్ = స్త్రీ విషయమైన రతిని; క్రోధం చ = ఇచ్ఛప్రతిహతం కాగా కలిగే కోపాన్ని; సంశ్రితాః = ఆశ్రయించి; ఆత్మ పర దేహేషు = స్వదేహంలోనూ, పరదేహంలోనూ ఉన్న; మామ్ = నన్ను (ఈశ్వరుణ్ణి); ప్రద్విషంతః = ద్వేషిస్తూ; అభ్యసూయకాః = సన్మార్గవర్తులగువారి గుణాలను నిందించేవారు అవుతున్నారు;
తా ॥ వారు సర్వానర్థాలకూ, సర్వదోషాలకూ మూలమైన అహంకారాన్ని, పరపీడాకరమైన బలాన్ని, ధర్మోల్లంఘన కారణమైన దర్పాన్ని, స్త్రీ విషయమైన కామాన్ని, ఇచ్ఛ ప్రతిహతం అవడం వల్ల కలిగే కోపాన్ని ఆశ్రయించి; తమ శరీరంలోనూ, ఇతరుల శరీరాలలోనూ (బుద్ధికి, కర్మలకూ సాక్షినై) వెలయుచున్న నన్ను (ఈశ్వరుణ్ణి) ద్వేషిస్తున్నారు – నా శాసనాన్ని అతిక్రమిస్తున్నారు; మరియు, సన్మార్గవర్తులైన వారి గుణాలను నిందిస్తున్నారు.