సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః ।
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిందాత్మసంస్తుతిః ॥ 24
సమ దుఃఖ సుఖః, స్వస్థః, సమ లోష్ట అశ్మ కాంచనః,
తుల్య ప్రియ అప్రియః, ధీరః, తుల్య నింద ఆత్మ సంస్తుతిః.
(యః = ఎవడు;) సమదుఃఖసుఖః = సుఖదుఃఖాలలో సమజ్ఞానియో; స్వస్థః = ఆత్మ స్వరూపంలో వెలయుచుండునో; సమ లోష్ట అశ్మ కాంచనః = మట్టిపెళ్ల, రాతిపెంకు, బంగారాలను సమానంగా చూస్తాడో; తుల్య ప్రియ అప్రియః = ఇష్ట అయిష్టాలను ఒకే రీతిగా చూస్తాడో; తుల్య నింద ఆత్మ సంస్తుతిః = నిందా స్తుతులలో సమబుద్ధియో; ధీరః = ధీరుడో (అతడు గుణాతీతుడు).
తా ॥ సుఖదుఃఖాలలో సమబుద్ధి, ఆత్మస్వరూప స్థితుడు, శిలామృత్పిండ సువర్ణాలలో సమదృష్టి, ప్రియాప్రియాలలో తుల్యజ్ఞాని, నిందాప్రశంసలను ఒకేరీతిగా గ్రహించేవాడు అయిన ధీరుడు గుణాతీతుడు.