బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ ।
సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ ॥
బహిః, అంతః, చ, భూతానామ్, అచరమ్, చరమ్, ఏవ, చ,
సూక్ష్మత్వాత్, తత్, అవిజ్ఞేయమ్, దూరస్థమ్, చ, అంతికే, చ, తత్.
తత్ చ = మరియు, అది; భూతానామ్ = చరాచరభూతాల; బహిః అంతః చ = బయటా, లోపలా కూడా (ఉంది); అచరమ్ = స్థావరమూ; చరమ్ ఏవ చ = జంగమం కూడా (అవుతోంది); సూక్ష్మత్వాత్ = సూక్ష్మమవడం వల్ల; తత్ = అది; అవిజ్ఞేయం = తెలియబడదు; దూరస్థమ్ = విషయ బద్ధులకు దూరంగా ఉంది; చ అంతికే = మరియు, శుద్ధచిత్తులకు దగ్గరే ఉంది.
తా ॥ అది స్వకార్యాలైన చరాచరాల వెలుపలా, లోపలా కూడా (స్వర్ణం ఆభరణాలలో, నీరు తరంగాలలో ఉండే విధంగా) ఉంది. (కార్యాలు కారణాత్మకాలు అవడం వల్ల) అది స్థావర జంగమాత్మకం.* అది అత్యంత సూక్ష్మం అంటే, రూపాది విహీనమవడం వల్ల అవిజ్ఞేయం. (ప్రకృతి కంటే పరంగా) విషయ బద్ధులకు అతి దూరంలో (ప్రత్యగాత్మ రూపంలో) శుద్ధ చిత్తులకు అత్యంత సమీపంలో ప్రకాశిస్తోంది.